చీమల్ని తింటుంది..
చిరుతతో పోరాడుతుంది..
తన జోలికి వస్తే ఎలుగవుతుంది..
ఏంటబ్బా ఆ జీవి అనుకుంటున్నారా..
అదే జెయింట్ ఆంట్ ఈటర్...
చూడటానికి విచిత్రంగా ఉండే ఈ జంతువు దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. గడ్డిభూములు, అభయారణ్యాల్లో ఉంటాయివి. వీటి ప్రధాన ఆహారం చీమలు. అందుకే యాంట్ ఈటర్ అన్న పేరు స్థిరపడిపోయింది.
మీరు నాలుగడుగుల పొడవుంటే .. మీ నాలుక మూడు అంగుళాల పొడవు మించి ఉండదు. కానీ శరీరం ఎంత పొడవుంటుందో నాలుక కూడా ఇంచుమించు అంతే పొడవుంటుంది ఈ వింత జీవికి.
ఆహారం తీసుకునేటప్పుడు ఆ సన్నని నాలుకను బారజాపి పట్టుకుని నోట్లో గుటుక్కున వేసుకుంటుంది. అది ఎంత వేగంగా జరుగుతుందంటే.. నిమిషానికి 150 నుంచి 160 సార్లు ఇది నాలుకతో ఆహారాన్ని పట్టేస్తుంది. సాధారణంగా జంతువుల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కానీ వీటి కడుపులో మాత్రం ఫార్మిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాంతో రోజుకు ముప్పై వేల పైన పురుగుల్ని, చీమల్ని తిన్నా ఈజీగా అరిగించుకుంటుంది ఈ జీవి.
దీని తల చివర గొట్టంలాగా మూతి ఉంటుంది. దాంతో ఇది చీమల వాసనని చటుక్కున పట్టేస్తుంది. పుట్టకనిపించిందా దీనికి పండగే. బలమైన ముందరి కాళ్లతో పుట్టను చీల్చి దానిలోకి మూతి పెట్టి నాలుకను లోపలి కంటూ దూర్చేస్తుంది. దీని నాలుక మీద ఒక రకమైన జిగురులాంటి పదార్థం ఉంటుంది. దాంతో చాలా చీమలు దానికి అంటుకుపోతాయి. నాలుకను లోపలికి పీల్చుకునేసరికల్లా అవన్నీ దాని నోట్లోకి వెళ్లిపోతాయి.
ఇంకో విచిత్రమైన విషయం తెలుసా? ఇది దీని నాలుకను నిమిషానికి 150 సార్లు బయటికి, లోపలికి ఆడించగలదు. మరి చీమలు కుట్టవా అంటే.. కుట్టలేవు. ఎందుకంటే దీని ఒంటినిండా దట్టమైన బొచ్చు ఉంటుంది కదా. అన్నట్టు.. దీనికి నోట్లో దంతాలుండవండోరు. క్షీరదాల్లో దంతాలు లేని జంతువు ఇదొక్కటే. అయితే అందుకు బదులు నోట్లో బలమైన కండరాలుంటాయి. వాటితోనే ఇది చీమల్ని చిదిమేసి మింగేయగలదు.
ఇవి వాసన చూడటంలో మనుషుల కంటే నలభై రెట్లు శక్తి కలిగినవి. వాసన చూసే ఇవి ఆహారాన్ని పసిగడుతాయి. ఇవి గుంపులుగా జీవిస్తాయి. వీటి గుంపును పైరేడ్ అంటారు. నిద్రపోయేటప్పుడు కూడా గుంపుగానే ఉంటాయి. ఇవి రోజుకు పదిహేను గంటల పాటు నిద్రపోతాయి. వీటి జీవిత కాలం 15 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది.
ఇక దీని కడుపులో ఇంకో విచిత్రం కనిపిస్తుంది. అక్కడ కండరాలతో పాటు, ఇసుక, గులక రాళ్లు ఉంటాయి. తిన్న కీటకాల్ని అరాయించుకోవడానికి యాంట్ ఈటర్ గారే వాటిని మింగుతుందన్నమాట. అవి కదలడం ద్వారా ఇది తిన్న ఆహారమంతా మనింట్లో రుబ్బురోలో, గ్రైండరో పనిచేసినట్లు పచ్చడైపోతుందన్నమాట.
సుమారు మూడు అడుగుల పొడవు, 30 కిలోల బరువు వరకూ పెరిగే ఇవి అవసరమైతే చిరుత పులులతో కూడా తలపడతాయి. సాధారణంగా శత్రువు కనిపిస్తే పారిపోయినా, ఇక తప్పదనుకుంటే మాత్రం వెనుక కాళ్ల మీద నుంచుని ముందరి కాళ్లతో పోరాడుతాయి. ఎలుగుబంటిలా వాటేసుకుని నొక్కి, గీరి చంపే శక్తి దీనికి ఉంటుంది. రోజుకో చోట గొయ్యి తవ్వుకొని అందులో గుండ్రంగా ఉండచుట్టుకుపోయి, తోకను చుట్టేసుకుని పడుకుంటాయివి. ఒకసారి ఒక పిల్లని మాత్రమే కంటాయి. బుజ్జి యాంట్ ఈటర్ పుట్టగానే తల్లి వీపు ఎక్కేసి కూర్చుంటుంది. అలా అది సుమారు ఏడాది వయసు వచ్చేవరకూ దిగదు. అయితే పాపం.. వీటి జాతి క్రమంగా అంతరించిపోతోంది.
Authorization