ఎలుగుబంటి జాతిలో 16 ఉపజాతులు ఉంటాయి. ఆసియా ఎలుగు బంటి అంటే.. మన జానపద కథల్లో వినిపించిన ఎలుగు. ఇది పూర్తిగా నల్లగా ఉంటుంది. మెడ కింద మాత్రం రిబ్బన్ కట్టినట్లుగా గోధుమ రంగులో ఉంటుంది. హిమాలయ ప్రాంతంలో ఉండడం వల్ల దీని ఒంటికి ఉండే జుట్టు కొంచెం ఒత్తుగా పొడవుగా ఉంటుంది. మెడ, భుజాల చుట్టూ ఫర్కోట్ వేసినట్లుగా జుట్టు ఒత్తుగా ఉంటుంది. ఈ జాతి ఎలుగుబంట్లు మన దేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, కాంబోడియా, చైనా, ఇరాన్, రష్యా, తైవాన్ దేశాల్లోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. దీనిని హిమాలయన్ బ్లాక్ బేర్, టిబెటన్ బ్లాక్ బేర్, మూన్బేర్ అని కూడా అంటారు, వీటి బరువు దాదాపుగా 150-225 కిలోల మధ్య ఉంటుంది. ఇవి మొక్కలు, కాయలు, కీటకాలు, చిన్న చిన్న జంతువులను కూడా తింటాయి. గొర్రెలు, మేకల మీద దాడిచేసి చంపేసి తింటాయి. పర్వత సానువుల్లోని పంట పొలాల మీద దాడిస్తుంటాయి. దాంతో వీటికి ప్రాణహాని మనుషుల ద్వారానే ఉంటుంది. అందుకే ఈ ఎలుగుబంట్లు ఎక్కువగా చెట్ల మీద కాలం గడుపుతాయి. చెట్ల మీద మంచె కట్టుకుని హాయిగా నిద్రిస్తాయి.