హాయ్ చిన్నారులూ..! హాట్ ఎయిర్ బెలూన్ గురించి మీరు వినే ఉంటారు..లేదంటే టీవీలోనూ చూసే ఉంటారు... భలే బాగుంటుంది కదా..మరి అంతపెద్ద బెలూన్ గాల్లోకి ఎలా ఎగురుతుందో... దాని వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటో తెలుసా..? తెలియకపోతే చదివేద్దాం రండి!
వేడి గాలి బెలూన్లు విమానాలలోని ఒక రకం. మానవుడు ఎగిరేందుకు ఉపయోగించి విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభ రూపమే ఈ హాట్ ఎయిర్ బెలూన్.
వేడి గాలి బుడగల ఉపయోగం పురాతన చైనీస్ నుండే మొదలయి ఉండవచ్చు. సాధారణంగా ఒక రకమైన అగ్నితో బుడగలోని గాలిని వేడి చేయటం ద్వారా వేడి గాలి బుడగలు పనిచేస్తాయి.
దీనిని 1782 డిసెంబరు 14 న మోంట్‌గోల్ఫియర్ సోదరులు రూపొందించారు. మొదట ఫ్రాన్స్‌లో తయారైందని చెబుతారు. ఆ బెలూన్ ఎనిమిది నిమిషాల పాటు గాల్లో తిరిగిందట. దాంట్లో మొట్టమొదటి ప్రయాణికులుగా ఓ గొర్రె, కోడి, బాతు ప్రయాణించాయట.
దీన్ని మొదటగా నడిపిన వ్యక్తి జీన్ఫ్రాన్సిస్. హాట్ ఎయిర్ బెలూన్‌కు కింద బుట్టలాంటి దానికి బెలూన్ అమర్చి ఉంటుంది. అక్కడ ఇంధనాన్ని ఉపయోగించి బర్నర్ల ద్వారా మంట మండిస్తే ఆ వేడికి బుడగ విప్పారి జామ్మంటూ గాల్లోకి ఎగురుతుంది. కిందున్న బుట్టలో మనం నిలబడి ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఎంచక్కా భూమ్మీద అందాల్ని చూడొచ్చు. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే.అయితే మంట మండిస్తే అది గాల్లోకి ఎందుకెగురుతుందో తెలుసా? దీని వెనకాల కొంత సైన్స్ ఉంది. సాధారణంగా వేడి గాలి బరువు తక్కువగా, చల్లగాలి బరువు ఎక్కువగా ఉంటుంది. తేలికగా ఉండే వేడిగాలి ఎప్పుడూ పైవైపునకు ప్రయాణిస్తుంది.
గాలి పరిమాణాన్ని బట్టి ఘనపు అడుగుల్లో కొలవచ్చు. ఒక ఘనపు అడుగులో ఉన్న చల్లగాలి బరువు దాదాపుగా 28 గ్రాములుంటుంది. 100 డిగ్రీల ఫారన్‌హీట్ వరకూ వేడిచేస్తే దాని బరువు ఏడు గ్రాములకు తగ్గిపోతుంది.బెలూన్ లోపల మంట మండించినపుడు దానిలోని గాలి అంతగా వేడైపోయి పైవైపునకు ప్రయాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ఫలితంగానే బుడగ ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తుంది.ఎక్కువ వేడిగాలి పట్టేలా పెద్దగా ఉండే బుడగలైతే ఎక్కువ ఎత్తుకు వెళతాయి. కాస్త చిన్నగా ఉండేవి తక్కువ ఎత్తు వరకే ప్రయాణిస్తాయి. అందుకు కారణం దానిలోపల గాలి పరిమాణమే.అయితే ఆ వేడికి బెలూన్ కరిగిపోదా అనే అనుమానం మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది.. మామూలుగా మనం ఊది ఆడుకునే గాలి బుడగలు కొంచెం వేడి తగిలితేనే ఢాం అంటూ పేలిపోతాయి. మరి ఈ హాట్ ఎయిర్ బెలూన్లలో ఏకంగా మంటే మండించినా అవి పేలవు. పాడుకావు ఎందుకో తెలుసా.? ఇంత పెద్దగా తయారుచేసినా ఈ బుడగలు చాలా తక్కువ బరువు ఉండటం అవసరం. అందుకని వీటిని ఎక్కువ వేడినైనా తట్టుకునేలా ఉండే ఓ రకమైన నైలాన్‌తో తయారు చేస్తారు. దానిలోపల భాగమంతా హీట్ రెసిస్టెంట్ పొర ఉంటుంది. దీనిలో బుడగలా కనిపించే భాగాన్ని ఎన్వలప్ అంటారు. దీంతో దీనిలో ఉన్న వేడిగాలి దాన్ని ఏమీ చెయ్యలేదు. బయటకూ వెళ్లలేదు. ఫలితంగానే అది పైకెగురుతుంది.
దీన్ని నడిపే వ్యక్తిని పైలట్ అనే అంటారు. మంటను తగ్గించడం, పెంచడం ద్వారా అతను బుడగను అదుపుచేస్తాడు. గాలి దిశను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మంటను తగ్గించడం ద్వారా కావల్సిన ప్రదేశంలో దీన్ని కిందికి దింపడం సాధ్యమవుతుంది.దీంట్లో ద్రవరూపంలోని ప్రొపలిన్ని ఎక్కువగా ఇంధనంగా వాడుతారు. పరిమాణాన్ని బట్టి అందులో ఎక్కే ప్రయాణికుల సంఖ్య మారుతుంది. ఉదాహరణకు రెండు వేల కేజీలకు పైగా గాలి ఉండే ఒక హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎనిమిది నుంచి పది మంది వరకూ ఆకాశంలో చక్కర్లు కొట్టచ్చు.
పిల్లలూ భలే బాగున్నాయి కదా.. హాట్ ఎయిర్ బెలూన్ ముచ్చట్లు.....
Authorization