జలుబు చేసినప్పుడు ఎక్కువగా తుమ్ములు రావచ్చు. కానీ అవి ఏ వ్యాధికీ సంకేతాలు కావు. ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా అవాంఛనీయ రేణువులు ముక్కు పుటల్ని సోకినప్పుడు అక్కడున్న నాడీ రేణువులు ఉత్తేజితమవుతాయి. అవాంఛనీయ రేణువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అక్కడ తిష్ట వేసుకుంటే ప్రమాదమన్న నాడీ సంకేతాల ప్రేరణ మెదడుకు చేరుకుంటుంది. వెనువెంటనే ఊపిరితిత్తులు గాలిని పెద్దపెట్టున ముక్కు రంధ్రాలు, నోటి ద్వారా బయటికి నెట్టేలా కండరాల్ని మెదడు ప్రేరేపిస్తుంది. ఆ గాలి తాకిడికి అవాంఛనీయ రేణువులను బయటకు నెట్టివేస్తూ తుమ్ములు వస్తాయి. మనకు తెలియకుండా అప్రయత్నంగానే అవి వస్తాయి. సాధారణంగా నిద్రపోయే వ్యక్తికి తుమ్ములు రావు. కానీ దగ్గు అలా కాదు. ఊపిరితిత్తుల్లో ఏదైనా జబ్బు (క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లాంటివి) ఉన్నప్పుడు కూడా దగ్గు వస్తుంది. అంతేకాదు ఒక్కోసారి దుమ్ము, ధూళిలాంటివి ఊపిరితిత్తుల్లో చేరుకున్నా వస్తుంది. ఊపిరితిత్తుల్లో తిష్ట వేసుకున్న మలినాల్ని వేగంగా బయటకి పంపించే ప్రయత్నమే దగ్గు.