మనదేశంతో సహా చాలా దేశాల్లో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది అన్నది కూడా ఒకటి. సాధారణంగా కొన్ని రకాల వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి మనపై తమ ప్రతాపాన్ని చూపించినప్పుడు మనకు జలుబు చేస్తుంది. అంతేకానీ నిమ్మరసం తాగడం వల్ల జలుబు చేస్తుందన్నది అవాస్తవం. అంతేకాదు, జలుబు చేసినవాళ్లు నిమ్మరసం తాగకూడదన్నది కూడా సరైనది కాదు. ఎందుకంటే నిమ్మరసం తాగడం వల్ల జలుబు రాదు సరికదా, వచ్చిన జలుబు తగ్గుముఖం పడుతుంది. ఎలా అంటే నిమ్మ రసంలో విటమిన్-సి అనేది పుష్కలంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసుకదా! అది మన శరీరపు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల జలుబు వైరస్లతో పోరాడే శక్తి మన శరీరానికి మరింతగా పెరుగుతుందన్న మాట. కేవలం నిమ్మపండ్ల విషయంలోనేగాక ఏ పండ్ల విషయాల్లోనూ అనవసరమైన ఆలోచనలను పెట్టుకోకుండా అన్నీ తినేయండి.