ఏదైనా వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటే దానిని నీటిలో వేస్తే అది మునిగి పోతుంది. కోడిగుడ్డు సాంద్రత మామూలు నీటి సాంద్రత కన్నా ఎక్కువ కావడం వల్ల అది నీటిలో మునుగుతుంది. నీటిలో మునిగినపుడు కోడిగుడ్డు అడ్డంగా పాత్ర అడుగున మునిగి ఉంటే అది మంచి గుడ్డని, గుడ్డు మొన కింది వైపుకు తిరుగుతూ పైకి తేలుతున్నట్లు ఉంటే అది చెడిపోయిందని అర్థం. గుడ్డును ఉడికిస్తే దాని సాంద్రత మామూలు పచ్చి గుడ్డు కన్నా ఎక్కువగా ఉంటుంది. కారణం నీటిలో కోడిగుడ్డు ఉడుకుతున్నపుడు ఆ నీరు కొంచెం గుడ్డుపై పెంకులో ఉండే అతి సన్నని రంధ్రాల గుండా మెల్లగా గుడ్డులోకి చేరుకోవడంతో గుడ్డు ద్రవ్యరాశి పెరిగి దాని సాంద్రత కూడా పెరుగుతుంది. మామూలు నీటిలో ఉప్పు కలిపితే నీటి సాంద్రత పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా కలిపే కొలదీ ఆ ఉప్పు నీటి సాంద్రత మరీ పెరుగుతుంది. అలాంటి నీటిలో కోడిగుడ్డును వేస్తే కోడిగుడ్డు సాంద్రత ఆ ఉప్పు నీటి సాంద్రత కన్నా తక్కువ కావడంతో అది కాస్తా ఆ ఉప్పు నీటిలో తేలుతుంది.