సీతాకోక చిలుకలు అందంగా ఉంటాయి. కానీ ఈ సీతాకోక చిలుక మాత్రం భయంకరంగా ఉంటుంది. గుడ్లగూబ కళ్లతో బెదరగొడుతుంది. పేరు 'ఔల్ బటర్ఫ్లై'. రూపాన్ని బట్టే దీనికీ పేరు. తమని తాము రక్షించుకోవడానికి జీవులన్నీ ఏదో ఒక మాయ చేస్తుంటాయి. వింత వేషాలు వేస్తూ శత్రుజీవిని కలవరపెట్టి పరారీ అవుతాయి. మరి ఈ సీతాకోక చిలుక రక్షణ కవచం ఏంటో తెలుసా? గుడ్లగూబ కండ్లు. దీని పెద్దపెద్ద రెక్కల బయటివైపు అచ్చంగా గుడ్లగూబ కండ్లను పోలినట్టే గుర్తులుంటాయి. గోధుమ, బూడిద రంగులతో ఉండే ఇవి నిజమైన కనుగుడ్లలానే ఉంటాయి. దీంతో ఇవి ఏదైనా ప్రాణాపాయం ఉందని తెలిస్తే రెండు రెక్కల్ని మూసి ఆ కళ్ల గుర్తులు మాత్రమే కనిపించేలా చేస్తాయి. శత్రుజీవి భయపడి వీటి జోలికి రాకుండా దూరంగా వెళ్లిపోతుంది. ఈ సీతాకోక చిలుకల్నే 'కైలిగో మెమ్నాన్' అని కూడా పిలుస్తారు. దాదాపు మూడు నుంచి ఎనిమిది అంగుళాల పొడవుండే ఇవి ఎక్కువగా మెక్సికో, దక్షిణ అమెరికా అడవుల్లో ఉంటాయి.