వింత రూపంతో ఉండే ఈ జీవిని 'స్లగ్' అంటారు. అంటే గుల్లలేని నత్తలాంటి జీవన్నమాట. గొర్రె ఆకారంలో దేహం చుట్టూ ఆకుల్లాంటి భాగాలతో ఉంటుంది కాబట్టి దీన్ని సముద్రపు ఆకుల గొర్రె అని పిలుస్తారు. ఈ జీవికే 'కోస్టాసైల్ల కురోషిమ' అనే మరో పేరూ ఉంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. తన శరీరంపై ఆధారపడిన నాచు నుంచి క్లోరోప్లాస్ట్ అనే కణాల్ని తీసుకుని కిరణజన్యసంయోగ క్రియ ద్వారా శక్తిని పొందుతుందట. ఈ శక్తి కొన్ని నెలల పాటు ఈ బుల్లి జీవి బతకడానికి ఉపయోగపడుతుంది. ఇలా మొక్క, వక్షం కాకుండా ఈ ప్రక్రియను అనుసరించే జీవి ఇది తప్ప ప్రపంచంలో మరేదీ లేదు. కేవలం 5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందిది. అంటే అంగుళం కన్నా తక్కువే. దూది లాంటి మెత్తని ఆకారంతో ఉండే ఈ చిన్ని జీవి ఎక్కువగా జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది.