మామూలుగా జంతువులు, కీటకాలు, మొక్కలు కాంతివైపు ఆకర్షితమవుతాయి. ఈ వైఖరిని 'ఫోటో ట్రాపిజమ్' అంటారు. కీటకాలన్నీ ఈ ధర్మం కలిగి ఉన్నా, కొన్ని ఈ ధర్మానికి వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, మంచాలను ఆశ్రయించుకుని ఉండే నల్లులు ఈ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటాయి. వెలుతురులో కాకుండా అవి చీకటిలోనే మనపై దాడి చేస్తాయి. దోమలు కూడా ఎక్కువ వెలుతురును భరించలేవు. తక్కువ వెలుతురులోనే అవి తమ శక్తిని మన శరీరాలపై ప్రదర్శిస్తాయి. కండ్లు లేని కీటకాలు కూడా ఈ ఫొటోట్రాపిజమ్ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఈ ధర్మం వాటి ఉదర భాగంలో వ్యాపించి ఉంటుంది. కొన్ని కీటకాలు పసుపు రంగులో ఉండే కాంతి వైపు ఆకర్షితమైతే, మరికొన్ని మెర్క్యూరీ లైట్ల వైపు ఆకర్షితమవుతాయి. లైట్ల కాంతిలోనే ఆడ, మగ కీటకాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి.