పీత జాతులన్నిటిల్లోకి పెద్దవి కోకోనట్ క్రాబ్లు. వీటినే బిర్గుస్ లేట్రో అని కూడా పిలుస్తారు. బరువు 15 కిలోల వరకూ ఉంటాయి. 3-4 అడుగుల పొడవుండే వీటి ఒక్కో కాలే మూడడుగులు ఉంటుంది. హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లోని ద్వీపాల్లో కొబ్బరి చెట్లుండే చోట ఎక్కువగా జీవిస్తాయి. పగలంతా బొరియల్లో హాయిగా నిద్రపోతాయి. రాత్రయితే చాలు చకచకా కొబ్బరిచెట్టెక్కెస్తాయి. ఇంకేముంది కొబ్బరి కాయల్ని వాటి బలమైన కొండేల్లా ఉండే ముందరికాళ్లతో చీల్చేసి గుజ్జంతా తినేస్తాయి. వీటికి దొంగపీతలని పేరుంది. ఎందుకంటే దగ్గర్లోని ఇళ్లలోదూరి ఆహారంతోఉండే కుండల్ని, తీరంలో ఉండే తాబేలు గుడ్లనీ ఎత్తుకుపోతాయట.