ఊరంటే మనుషులుంటారు... కానీ ఓ ఊరిలో మాత్రం అడుగడుగునా మనుషుల్లాంటి బొమ్మలుంటాయి. వీధుల్లో, ఇండ్లలో, బడుల్లో, చివరికి రహదారులపై అంతటా బొమ్మలు కనిపించి అబ్బురపరుస్తాయి. అందుకే ఆ ఊరిని డాల్ విలేజ్‌గా పిలుస్తారు. అది ఎక్కడ అంటారా జపాన్‌లో ఉన్న మారుమూల ఊరు నగొరొ. ఇలా ఆ గ్రామం నిండా బొమ్మలు ఎందుకున్నాయంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే. ఆ ఊర్లో ఒకప్పుడు జనాలు బాగానే ఉండేవారు. ఇది మారుమూల ప్రాంతంలో ఉండేసరికి ప్రజలకు ఉపాధి లేక వలస బాట పట్టారు. దీంతో ఊరిలో 27 మంది మాత్రమే మిగిలారు. 13 ఏండ్ల క్రితం అయనో త్సుకిమి అనే ఆవిడ తమ గ్రామానికోసారి వెళ్లొద్దామని వస్తే మనుషులు లేక బోసిపోవడం కనిపించింది. ఊరు కళకళలాడాలంటే ఏంచేయాలా అని ఆలోచించగా ఈ ఉపాయం తట్టింది. మనుషుల స్థానంలో ఊరు మొత్తం బొమ్మలతో నింపేసింది. అలా ఊరి జనాభా ఎంతుండేదో కనుక్కుని 350కిపైగా బొమ్మలను సొంతంగా తయారుచేసింది. వీటిని చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ బొమ్మలన్నీ దూరం నుంచి చూస్తే మనుషుల్లానే కనిపిస్తాయి. ఈమె చేసిన మొదటి బొమ్మ వాళ్ల నాన్నదే. అసలు ఈ బొమ్మలను ఏ పదార్థంతో చేస్తుందో తెలుసా? ఎండు గడ్డి, పాత గుడ్డలు, ఉన్ని దారాలు ఉపయోగించి చేసి, వాటికి తగ్గట్టు దుస్తులు కుడుతుంది. ఒక్కో బొమ్మ కేవలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. తర్వాత పాడైపోతే ఆ స్థానంలో మరో కొత్త బొమ్మను చేసి పెడుతుంది.
Authorization