ఒక రైతు తన పొలంలో దుంపలు పండించేవాడు. అందులో ఒక చిలకడ దుంప పక్కన ఉన్న వేరే దుంపలతో ''దుంపలన్నింటిలో నాకు ఎవరూ సాటిరారు. నన్ను పచ్చిగా కూడా తింటారు. నాకున్న రుచి, రంగు, ఆకారం చూసి చిలకతో పోలుస్తూ చిలకడ దుంప అని పేరు పెట్టారు. కందలాగా నేను అందవికారంగా ఉండను. ఇంక పెండలాన్ని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. బంగాళదుంప సరిపడకపోతే వాతం. చామదుంపని తినాలంటే దురద. ఇక క్యారెట్, బీట్రూట్, ముల్లంగులకి ఉన్న వగరు వల్ల పచ్చిగా తినడం కష్టం. అదే నేనైతే తియ్యటి రుచితో ఎన్నో పోషకాలు కలిగి నోరూరించే ఆకారంలో ఎర్రగా ఉంటాను. అందుకే నేను దుంపలన్నింటిలో రాణిని'' అని మురిసిపోయింది. మర్నాడు ఒక గండుచీమల గుంపు చేనులో దాడికి దిగింది. అన్నింటికంటే చిలకడ దుంపే తీపి అని తెలుసుకుని దాన్ని పీకి వదిలిపెట్టాయి. దాంతో పక్కన ఉన్న దుంపలన్నీ నవ్వాయి. 'చూశావా నీ గొప్పలు నీకే చేటు చేశాయి. నీ వాసన, రుచి నీ కొంప ముంచాయి' అని అన్నాయి. దాంతో చిలకడ దుంప పొగరు అణిగింది.