హాయ్ చిన్నారులూ..! మీకు నూడుల్స్ అంటే చాలా ఇష్టం కదూ...! రోజులో ఒకసారైనా నూడుల్స్ చేయమని అమ్మను పోరుపెడుతుంటారు. మరి అంత ఇష్టమైన నూడుల్స్‌ని వేటితో తయారు చేస్తారు, ఎలా చేస్తారో తెలుసా..? అయితే ఇది చదివేయండి మరి...!
నూడుల్స్ అనే పదం 'నూడెల్' అనే జర్మన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో నూడుల్స్ అంటే 'ముడి' అని అర్థం. ఇవి రింగులురింగులుగా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కదా! అందుకే వాటికా పేరు వచ్చింది. ఇటలీ వాళ్లు వీటినే పాస్తాలంటారు. అరబ్బులైతే రెస్టా అంటారు.
నూడుల్స్‌ని మొదట చైనాలో హన్ రాజవంశం కాలంలో బియ్యం పిండితో తయారుచేసేవారు. వీటిని కేవలం రాజవంశీయులు, సంపన్నులు మాత్రమే తినగలిగే ఆహారంగా పరిగణించేవాళ్లు. అప్పటికి వీటికి స్థిరమైన పేరుకూడా ఉండేది కాదు. ఆ కాలంలో 'బోటుఓ', 'బుటు' అని పిలిచేవాళ్లు.
ఇటలీ నావికుడు 'మార్కోపోలో' ప్రపంచానికి నూడుల్స్ రుచిని పరిచయం చేశాడని అంటారు. 9 వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి ఈ చైనా నూడుల్స్‌కి చెందిన కిటుకులను జపాన్‌కు తీసుకుపోయాడు. అక్కడ గోధుమలతో చేసిన నూడుల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అలా ప్రపంచమంతా వ్యాపించాయి.
సాధారణంగా నూడుల్స్‌ని గోధుమలతో చేస్తారు. కొన్ని దేశాల్లో బియ్యం పిండితో చేస్తారు. జపాన్ వాళ్లయితే బియ్యంపిండి, ఉడికించిన బంగాళదుంపలతో నూడుల్స్ చేస్తారు. మొదట్లో అయితే వీటిని చేతితో పిండిని సాగదీయటం ద్వారా చేసేవాళ్లు. యంత్రాలతో చెయ్యడం ఆరంభించాక పెద్ద మొత్తంలో త్వరగా చెయ్యగలుగుతున్నారు. ఎలాగంటే నాణ్యమైన గోధుమ పిండికి నీటిని కలిపి ముద్ద చేస్తారు. సాగేగుణం వచ్చేవరకు కలియబెట్టి యంత్రాల్లో పెడతారు. తరువాత చక్రాన్ని తిప్పడం ద్వారా పొడవైన మెత్తని దారాల్లా బయటికి వస్తాయి. వాటిని ఆరబెట్టి కావాల్సిన పరిమాణంలో చుట్టి పొడవుగా కత్తిరిస్తారు
వీటిని రోజూ తింటే ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఊబకాయం వస్తుందని అనుకుంటారు.. కానీ ఒక కప్పు వండిన నూడుల్స్‌లో కేవలం రెండు గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇంకా... విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ల వంటి శక్తివంతమైన పోషకాలుంటాయి. అందుకే ఏ వయసు వాళ్లయినా తినొచ్చు. కొవ్వు శాతం తక్కువుంటుంది కనుక త్వరగా జీర్ణమవుతుంది కూడా. అయితే రుచికోసం అదనంగా వాడే ఉప్పు, నూనె, సాస్‌లు, మసాలాలు చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని బదులు, కొత్తిమీర, కాయగూర ముక్కలు, మిరియాల పొడి వంటివి చేర్చుకుంటే రుచికిరుచి ఆరోగ్యం కూడా.
Authorization