హాయ్ పిల్లలూ! మనం బయటికి వెళ్లాలంటే ఇవి తప్పకుండా ఉండాల్సిందే. ఇవి లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేం. ఏంటవి అంటారా? అవే చిన్నారులూ.. చెప్పులు.. మన నిత్య జీవితంలో ఎంతో అవసరమైనవి. మరి వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు కనిపెట్టారు.. ఎప్పుడు తయారు చేశారో...?
శతాబ్దాల చరిత్ర
- 1305లో బహుళ అంగుళాల ఇంగ్లిషు షూ తయారైంది. దాని ఎత్తు 2.5 అంగుళాలు.
- 14, 15 శతాబ్దాల్లో రెండు అంగుళాలకు మించి చెప్పుల ఎత్తు ఉండకూడదనే చట్టం వచ్చింది.
- 15వ శతాబ్దంలో పట్టు, వెల్వెట్ వస్త్రాలతో పురుషుల బూట్ల తయారీ మొదలైంది. వాళ్ల బట్టలు కుట్టిన వస్త్రంతోనే బూట్లను చేయించుకునే ఫ్యాషన్ కూడా మొదలయింది ఇప్పుడే.
- 16వ శతాబ్దంలో ముందుభాగం వెడల్పుగా ఉండేది. 17 కల్లా ఎత్తు మడమల చెప్పులు, బూట్లు వచ్చాయి. అంతేకాదు బూట్లకు, చెప్పులకు లేసులు, రిబ్బన్లు అతికించడంతో పాటు, ఎంత ఎత్తుంటే అంత ఇష్టపడేవాళ్లు.
- 18వ శతాబ్దంలో బంగారం, వెండి పట్టీలతో రత్నాలను పొదిగి అలంకరించేవారు.
- మొదటి బూట్ల కర్మాగారం 1760లో మసాచుసెట్స్‌లో ప్రారంభమయింది.
- 19వ శతాబ్దంలో అన్ని పరిమాణాల్లో తక్కువ ధరలో బూట్లు, చెప్పులు తయారవడం మొదలయ్యాయి.
- కుట్టు యంత్రాల ఆవిర్భావంతో 20 వ శతాబ్దంలో అనేక రంగుల్లో, అసంఖ్యాక రీతుల్లో చెప్పులు తయారవుతున్నాయి.
- చెప్పుల చరిత్ర ఆదిమానవుల కాలం నాడే మొదలయ్యింది. ముందైతే .. రాళ్లూ, రప్పల్లో తిరుగాడిన వాళ్లే. ముండ్లు గుచ్చుకున్నా మొరటుగా బతికేశారు. కాస్తంత జ్ఞానం వచ్చేసరికి అప్పుడు వచ్చింది. నొప్పి తప్పించుకోవాలన్న ఆలోచన. అదిగో.. అలా మొదలయింది ఈ చెప్పుల గోల.
- ఏం చేశారంటారా..? ఇంకేం చేస్తారు? మొదట్లో పాదాలకి గడ్డిని చుట్టుకునేవాళ్లు. రాను రానూ జంతువుల తోలును అరికాళ్లకి చుట్టి ఊడిపోకుండా తాడుతో కట్టేసేవాళ్లు. తోలెక్కడిది? అని మాత్రం అడగకండి. జంతువుల్ని తినే కాలంలో తోళ్లకు కరువా?
- చెప్పులకు ఓ ఆకారం తీసుకొచ్చింది మాత్రం ఈజిప్టియన్లు. నాగరికత నేర్చిన మొదట్లోనే చెప్పులు, బూట్లు తయారు చేశారు. తోలు లోపల కాగితం చుట్టలను కూరి లేసులతో కాళ్లకి కట్టేవారు. కాలి వేళ్లకు నొప్పి కలగకుండా ఆ భాగాన్ని కాస్తంత పైకి మడిచేవారు. క్రీస్తు పూర్వం 2 వేల నాటి ఈజిప్షియన్ సమాధుల్లో ఆ కాలం నాటి తోలు బూట్లు దొరికాయి. వాటిని ప్రదర్శన శాలలో భద్ర పరిచారు.
- ఇంకో గమ్మత్తేంటంటే.. బాగా చలిగా ఉండే ప్రాంతాల వాళ్లు ఏం చేసేవారో తెలుసా! సంచుల్లో గడ్డిని కూరి కాళ్లకి తొడిగేసే వాళ్లు. ఈ రకమైనవే చెప్పులుగా చాన్నాళ్లు చలామణి అయ్యాయి.
- ఆ తరువాత ఎంతో కాలానికి ఈజిప్టు స్త్రీల చెప్పుల చరిత్ర మొదలయింది. ఎందుకంటే ఇవి కాస్తంత సొగసుగా తయారయ్యాయి. తోలును శుద్ధి చేసి చెప్పులు కుట్టారు. వాటికి విలువైన,
- రాళ్లు, రత్నాల వంటి వాటితో అలంకరణలు చేశారు. వీటిని చూసి 5వ శతాబ్దపు గ్రీకు మహిళలు మనసు పడ్డారు. వాళ్ల ఆడంబరాన్ని చాటేటట్టు తయారు చేయించుకున్నారు. అవి వాళ్ల అందం, గాంభీర్యం, విలాసాల్ని చాటేవి. మెసపటోనియాలో తోలుకు పట్టీ వేసే వాడకం మొదలయింది. రోమన్ల సామాజిక స్థితిని చెప్పుల ద్వారా ప్రదర్శించేవారు. మంత్రులు తెలుపు బూట్లు, ప్రజా ప్రతినిధులు గోధుమ రంగు బూట్లు ధరించేవాళ్లు.
- చెప్పుల్నే పాదరక్షలంటారని తెలుసు కదా? మనమిప్పుడు వాడుతున్న చెప్పుల్ని మొదట్లో సైనికుల కోసం తయారు చేశారు. వాళ్లు ఎక్కువ దూరాలు ప్రయాణించాలి కనుక ఎక్కువ కాలం మన్నేలా ఉండాలి. అందుకే నాణ్యమైన చెప్పుల తయారీ మొదలయింది. ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండుల్లో నాణ్యమైన, అందమైన పాదరక్షల తయారీ పరిశ్రమలు వెలిశాయి. రబ్బరు, ప్లాస్టిక్, గుడ్డ, చర్మ, చెక్క ఒకటేమిటి ఎన్నో రకాల చెప్పులు తయారుచేస్తున్నారు.
Authorization