ప్రపంచంలో దాదాపు 160 జాతుల గుర్రాలున్నాయి. అన్నింట్లోకి అరేబియన్ గుర్రాన్ని ఉత్తమ జాతిగా పేర్కొంటారు. ఐదేండ్ల వయసు వచ్చేవరకూ గుర్రాన్ని గుర్రం అనరు. మగది అయితే కాల్ట్ అని, ఆడది అయితే ఫిల్లీ అని అంటారు. భూమ్మీద నివసించే జీవులన్నింటిలోకీ గుర్రం కండ్లు పెద్దవిగా, ప్రత్యేకంగా ఉంటాయి. దానివల్ల ఒకేసారి రెండు కండ్లతో రెండు దృశ్యాలను చూడగలవు ఇవి. అంతేకాదు చిక్కని చీకటిలో సైతం కొన్ని మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా గుర్తించగలిగే శక్తి వీటి కండ్లకు ఉంది. వీటి చెవులు కదులుతూ ఉంటాయి. గుండ్రంగా తిరుగుతాయి కూడా. ఆ కదలికను బట్టి వీటి దృష్టి దేనిమీద ఉందో చెప్పేయవచ్చు. ఎందుకంటే కన్ను ఎటువైపు చూస్తుందో, చెవి కూడా అటువైపే తిరుగుతుంది. వీటి ఎత్తును 'హ్యాండ్స్'లో కొలుస్తారు. ఒక హ్యాండ్ నాలుగు అంగుళాలతో సమానం. మగ గుర్రాలకు 40-44 దంతాలు ఉంటే, ఆడ గుర్రాలకు 36 ఉంటాయి. ఈ దంతాలను బట్టే వీటి వయసును లెక్కిస్తారు. అయితే అది కూడా తొమ్మిదేళ్లు నిండే వరకే. ఆ తర్వాత వీటి వయసును దంతాల ద్వారా కనుక్కోవడం కష్టమంటారు జీవశాస్త్రవేత్తలు. ఇవి రోజుకు కేవలం 1-3 గంటల సేపు నిద్రపోతాయి. దాంట్లోనూ కాసేపు నిలబడి కూడా నిద్రపోతుంటాయి. దాదాపు జీవులన్నీ కూడా శ్వాసనాళాల్లో సమస్య ఉంటే నోటితో శ్వాసను తీసుకుంటుంటాయి. కానీ గుర్రాలు అలా చేయలేవు. అంతేకాదు ఇవి త్రేన్చలేవు. వాంతి చేసుకోలేవు. తెల్లగుర్రాల జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదని పరిశోధనలు తేల్చాయి. ఒక్కసారి మనం ప్రేమగా సాకితే గుర్రాలు మనలను జీవితంలో మర్చిపోవట. పైగా ఎంతమందిలో ఉన్నా కూడా మనల్ని గుర్తుపట్టేస్తాయట. అలాగే స్థలాలు కూడా. కొంతకాలం వీటిని ఓ ప్రదేశంలో తిప్పి, తర్వాత దూరంగా తీసుకెళ్లి వదిలేస్తే, ఇవి తిరిగి పాత ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోగలవట.న
Authorization