హాయ్ ఫ్రెండ్స్..! తూనీగల్ని చూడగానే ఎవరికైనా ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. వాటిని పట్టుకోవాలని ఎగిరిగంతులేస్తుంటాం... అవి గనక మన చేతికి చిక్కాయో ఇక అంతే సంగతులు...వాటిని ఆడిస్తూనే ఉంటాం... అయితే ఇవి చూడ్డానికి అల్పంగా కనిపిస్తాయి కానీ వీటి చరిత్ర చాలానే ఉంది...
- తూనీగలు డైనోసర్లకంటే పెద్దవే.... ఆగండి... ఆగండి ఆకారంలో పెద్దవనుకునేరు... కాదు... వయసులో పెద్దవి. దాదాపు... 30 కోట్ల ఏండ్లకు ముందే తూనీగలు తిరిగేవని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు... ఎగిరే కీటకాల్లో మొదటిది, పెద్దదీ ఇదేననీ చెబుతున్నారు.
- ఒక్క అంటార్కిటికాలో తప్ప ప్రతి చోటా వీటిని చూడొచ్చు. తూనీగల్లో 5,680 జాతులుంటాయి. దీని శాస్త్రీయనామం ఇన్ఫ్రాఆర్డర్ ఎనిసొప్టెరా. గ్రీకు భాషలో ఎనిసోస్ అంటే అసమాన, ప్టెరాస్ అంటే రెక్కలు. విశాలమయిన, నాలుగు రెక్కలు కలిగిన కీటకంగా దీనికాపేరు వచ్చింది. అందుకనే ముందుకి, వెనక్కి అన్ని వైపులకూ ఎగరగలదు.
- వేగంలో మరే కీటకమూ తూనీగతో పోటీపడలేదు. పెద్ద తూనీగ గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. అందుకనే విమానం రెక్కల తయారీలో తూనీగ రెక్కల నమూనానే తీసుకున్నారు. పారదర్శకంగా ఉండే ఈ రెక్కలు ఈదురు గాలుల్ని సైతం తట్టుకోగలవు.
- ఇంకో విశేషం ఏంటంటే తూనీగలకి ఆరు కాళ్లున్నా నడవలేవు. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, దేన్నయినా పట్టుకోవడానికి మాత్రమే అవి
ఉపయోగపడుతాయి.
- ఇకపోతే... పొడవాటి తోక శరీరం కంటే పెద్దగా ఉంటుంది. రెండు కండ్లూ మొహమంతా కప్పేసి ఉంటాయి. ఒక్కో కంటిలో 30 వేల కటకాలుంటాయి. అవి 360 డిగ్రీల దృష్ణి కోణాన్ని కలిగి, ఎంత దూరమైనా చూడగలవు. వెనక్కు తప్పించి ఒకేసారి మిగతా అన్ని దిక్కులకూ దృష్టిని సారించగలవు. అందుకే వెనక నుంచి అయితేనే వీటిని పట్టుకోగలం. అంతేకాదు.. తూనీగలు అతినీలలోహిత కిరణాల ధాటిని కూడా తట్టుకోగలవు.
- తూనీగల ప్రధాన ఆహారం దోమలు. ఇవి గాల్లో ఎగురుతూనే దోమల్ని పట్టుకు తింటాయి. రోజుకు 50, 60 దోమల్ని తింటాయి. ట్రినిడా, మయన్మార్ల్లోని గిరిజనులు దోమల బారినుంచి తప్పించుకోవడానికి వీటికి నీటి ఆవాసాలను ఏర్పాటు చేసి పెంచుతారు. ఇంకా అరుదుగా తేనెటీగలు, చీమలు, కందిరీగల్ని కూడా తింటాయి. వీటికి కప్పలు, పక్షులు, బల్లులు, సాలెపురుగులు, చేపలు, తాబేళ్లు ఇతర జలచరాల వల్ల ముప్పు ఉంటుంది.
- అందుకే మంచినీళ్లు ఎక్కడుంటే అక్కడ గుడ్లు పెట్టేస్తాయి. చెరువులు, సరస్సులు, చిత్తడి నేలలు, ప్రవాహాల అడుగున గుడ్లను పెడతాయి. అవి లార్వాదశకు మారి అయిదువారాల్లో పిల్లలుగా బయటకు వచ్చేస్తాయి. పెద్ద తూనీగ గుడ్లు పెట్టే కాలం దాదాపు 5 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. చిన్న జాతుల్లో రెండు మూడు నెలల వరకూ ఉంటుంది.
- ఏ కారణంగానైనా వీటికి రెక్కలు విరిగిపోతే మళ్లీ పెరుగుతాయి. అన్ని జాతుల తూనీగల రక్తం చల్లగానే ఉంటుంది. అందుకే అవి సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. ఆడవాటికంటే మగవి ముదురు రంగుల్లో ఉంటాయి. వీటి రంగు వెలిసిపోయి తిరిగి సహజంగానే ముదురు వర్ణంలోకి మారుతుంటుంది.
- తూనీగలు ఆడవాటిని ఆకట్టుకోవడానికి ఎగిరే పందాలు పెట్టుకుంటాయట. ఏదైతే తన వద్దకు త్వరగా చేరుకుంటుందో దానికే ఆడ తూనీగ ఓటేస్తుంది. ఒక్క ఆస్ట్రేలియాలోనే 320 తూనీగ జాతులున్నాయి. చైనా 20 పవిత్ర జంతువుల జాబితాలో తూనీగ కూడా ఒకటి. తూనీగలు ఒక కన్నుమూసి మరో కన్ను తెరిచి నిద్రపోతాయట మరి.