కివీ పక్షులకు తోక ఉండదు. రెక్కలు ఉన్నా చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఇవి ఎగురలేవు. చూడ్డానికి చిన్నగా ఉన్నా కివీ చాలా బలమైన పక్షి. వీటి ముక్కు, కాళ్లు చాలా బలంగాఉంటాయి. చర్మం లెదర్లాగా మందంగా ఉంటుంది. ఈకలు దళసరిగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటికి శ్వాసరంధ్రాలు ముక్కు చివర ఉంటాయి. కుక్కల కంటే వేగంగా ఇవి వాసనలను పసిగట్టగలవు. ఇవి రాత్రిపూట ఆహారాన్ని వేటాడుతాయి. పురుగుల్ని ఏరుకోవడం కోసం ముక్కుతో నేలను లోతుగా తవ్వుతాయి. అలా తవ్వేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తాయి. పురుగులతో పాటు పువ్వులు, ఆకులు, సాలీళ్లు, లార్వాలు, చిన్న చిన్న చేపలు, కప్పలను తింటాయి. విశ్రాంతి తీసుకునేటపుడు ఇవి మనుషుల మాదిరిగా రెండు కాళ్లూ చాచుకుని కూర్చుంటాయి. వీటి కాళ్లు, ముక్కు చాలా బలంగా ఉంటాయి. వాటి సాయంతో లోతైన గొయ్యి తవ్వి, అందులో నివసిస్తాయి. వీటికి కోపం చాలా ఎక్కువ. అవి నివసించే స్థలాన్ని వేరే ఇతర జంతువులేవైనా కబ్జా చేయాలని చూస్తే తీవ్రంగా మండిపడతాయి. ముక్కుతో పొడిచి పొడిచి తరిమేయాలని చూస్తాయి. కివీ పెట్టే గుడ్డు దాని శరీరపు బరువు కంటే పదిహేను శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో కడుపులో గుడ్డు ఉన్నపుడు పొట్ట బాగా సాగిపోయి నేలకు తగులుతుంటుంది. ఇవి గుడ్లను పొదిగి వదిలేస్తాయి తప్ప.. పిల్లలకు తిండి పెట్టి పెంచవు. పుట్టేటప్పటికి పిల్లల కడుపులో గుడ్డుసొన లాంటి ద్రవం ఉంటుంది. దాని కారణంగా కొన్ని రోజుల వరకూ పిల్లలు తిండిపెట్టకపోయినా బతికేస్తాయి. ఆ తరువాత అవే ఆహారం వేటాడ్డం అలవాటు చేసుకుంటాయి.
Authorization