హాయ్ ఫ్రెండ్స్...! కరకరలాడే చిప్స్ అంటే చిన్న నుండి పెద్ద వరకు అందరికీ ఇష్టమే. నోటికి కమ్మగా, ఉప్పగా తగులుతూ ఊరించేస్తాయి. చూస్తే పొట్లం ఖాళీ చెయ్యకుండా వదల్లేం. మరి అంత టేస్టీయైన చిప్స్‌ను మొదట ఎవరు తయారు చేశారు..? ఎప్పుడు తయారు చేశారో..? తెలుసుకుందామా...
- పొటాటో చిప్స్ అని మనమే కాదు... అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్, ఆఫ్రికా, హవారు, జమైకా, యూరప్ దేశాల వాళ్లూ అలాగే అంటారు. ఐరిష్, బ్రిటిష్ భాషల్లోనైతే క్రిస్పస్, న్యూజిలాండ్ వాసులు చిప్పీస్ అని, బంగ్లాదేశ్‌లో వీటిని కిరిస్, ఆలూర్ పపోర్ అనీ అంటారు.
- అయితే చిప్స్ తయారీ వెనుక చాలానే చరిత్ర ఉంది. ఒకరి దురుసుతనం, వేరొకరి సహనంతో ఇవి తయారయ్యాయి. అసలేమైందంటే ... అమెరికాలోని న్యూయార్క్‌లో మూన్‌లేక్ హోటలుంది. అక్కడికి కార్నెలియస్ వాండర్బిల్ట్ అనే ఆయన తరచూ వచ్చేవాడు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా వచ్చి బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రై కోరాడట. ఆ హోటల్లో జార్జ్ క్రమ్ అనే వంటతను ఆ వేపుడుని వడ్డించాడు. అది కార్నేకి నచ్చలేదు. ఎందుకంటే ముక్కలు సరిగా వేగలేదన్నాడు. మళ్లీ ఇంకాస్త వేయించి తీసుకొస్తే చప్పగా ఉందన్నాడు. ఇలా ఒకటి రెండుసార్లు అయ్యాక వాండర్బిల్ట్ జార్జ్ మీద కోపంగా అరిచాడు. దాంతో జార్జ్ తన యజమానికి ఫిర్యాదు చేశాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆయన్ని శాంతపరచు అన్నాడు యజమాని.
- చేసేదేమీ లేక జార్జ్ వంటగదిలోకి వెళ్లి దుంపల్ని పలుచగా కోసి, మరిగే నూనెలో వేసి కరకరలాడేలా వేయించేశాడు. వాటికి కాస్త ఎక్కువ ఉప్పు జోడించి ఇచ్చాడు. వాటిని తిన్న తరువాత వాండర్బిల్ట్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే.. అవి చేతికి అంటుకోలేదు... సరికదా ఉప్పుప్పగా కరకర లాడుతూ తెగ నచ్చేశాయి. ఇక ఎప్పుడు అక్కడికి వచ్చినా అవే కావాలనే వాడు. ఇక అప్పటి నుంచి ఆ హోటల్ వంటకాల జాబితాలో వాటినీ చేర్చారు. దాంట్లో వాటి పేరు సరటోగా చిప్స్.. అంటే పొడిగా వేయించిన అని అర్థమట.
- హోటల్‌కి వచ్చినవాళ్లంతా వాటినే ఇష్టంగా తినేవాళ్లు. అది గమనించిన జార్జ్ సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. ఆ చిప్స్‌కి వెన్న, వెనిగర్, మసాలా, కారంలాంటివి జోడించి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. వాటిని పెద్ద ఎత్తున తయారుచేయించేవాడు. బగ్గీల ద్వారా తరలించి గాజు పీపాల్లో పెట్టి బయటే విక్రయించేవాళ్లు. కాకపోతే అవి త్వరగా మెత్తబడటం, విరిగిపోవడం, పొడిబారటం జరిగేది.
- 1895లో చిప్స్‌ని తాజాగా ఉండేందుకు మైనపు కాగితం కవర్లలో ప్యాక్ చేయించి అమ్మడం ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో చిప్స్ పట్ల అందరికీ ఇష్టం పెరిగింది. యంత్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో చిప్స్‌ను తయారుచేసే సంస్థలూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో బాగా పేరు పడ్డవి బాల్రిచ్, లేస్ సంస్థలు.
- సరే ఇప్పుడు మీకో ఆశ్చర్యకర విషయం చెప్పనా.. 14వ వతాబ్దంలో మన తెలుగు వంటకాల్లో వరుగులు అని ఉండేవి. అంటే కాయగూర ముక్కల్ని ఎండబెట్టి తరువాత నూనెలోనో, నెయ్యిలోనో వేయించుకు తినేవారన్నమాట.
- అయితే మామూలు దుంపల పోషకాలతో పోల్చితే చిప్స్‌లో కొవ్వు ఆమ్లాలు, సోడియం, చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీటిని మితంగానే తినాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని సంస్థలు తయారీలో మార్పులు తీసుకొచ్చాయి. ఉప్పు తగ్గించి, రుచి మారకుండా, పాడవకుండా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తున్నాయి.
Authorization