ఎడారులలో వర్షం చాలా తక్కువగా పడుతుంది. ఆ పడిన వర్షం కూడా ఇసుక కొద్దిగా తడవటానికి కూడా చాలదు. మరి ఎడారులలో ఒయాసిస్సులు ఎలా వస్తాయి? ఎక్కడో నేలలో ఇంకిపోయిన నీరు రాళ్లు, ఇసుక వంటివి ఉన్న పైపొర సందులలో నుండి భూమి లోపలికి పోతుంది. ఇది భూమి లోపల మడుగులాగా ఏర్పడుతుంది. ఇటువంటి నీరు భూమిలో ఖాళీలు ఉన్న చోటల్లా వెతుక్కుంటూ, భూమికి సమాంతరంగా నెమ్మదిగా ప్రవహిస్తుంటుంది. ఇలా భూమి లోపలి నీరు దారి వెతుక్కుంటూ అసలు వర్షం పడిన చోటు నుండి చాలా దూరం వెళ్లగలదు. చిల్లులు లేని రాతిపొర లేదా బంకమట్టి పొర ఎగుడుదిగుడుగా ఉండి, ఒక్కొక్కసారి నేల పైకి పొడుచుకుని రావచ్చు. అది అక్కడ ఊటలాగా ఏర్పడుతుంది. ఎడారులలో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడో దూరాన కొండల మీదపడిన నీరు భూమిలోపల ఇంకి లోలోపలే అడ్డంగా ప్రవహించి, అనేక వందల మైళ్లు వెళ్లి ఎడా మధ్యలో పైకి ఉబికివస్తుంది. ఈ నీటినే 'ఒయాసిస్సు' అంటారు.