హాయ్ నేస్తాలూ...! మీకు సినిమాల్లో కనిపించే హీరోలంటే ఇష్టం కదూ.. ఎందుకంటే.. వాళ్లు భలేగ ఫైట్స్ చేస్తుంటారు. గాల్లో పల్టీలు కొడుతూ.. విలన్ల పనిపట్టేస్తుంటారు. మరి మీరెప్పుడైనా నిజమైన హీరోలను చూశారా? వాళ్లే మన సైనికులు. మనదేశాన్ని శత్రువుల బారినుంచి కంటికి రెప్పలా కాపాడుతుంటారు. మనం ఇంత హాయిగా ఎటువంటి భయాలు లేకుండా ఉంటున్నామంటే దానికి కారణం వాళ్లే.
- సైనికులు దేశ రక్షణకు నిత్యం పోరాడుతూనే ఉంటారు. మనం రాత్రుళ్లు హాయిగా నిద్రపోవాలన్నా, బడికెళ్తున్నామన్నా, ఆడుకుంటున్నామన్నా కారణం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులే. వాళ్లకు దేశాన్ని కాపాడాలనే తపన తప్ప ఎండ, వాన, చలిలాంటివేవీ పట్టవు. మొన్నటికి మొన్న జరిగిన పుల్వామా ఘటనలో పదుల సంఖ్యలో సైనికులు మనకోసం ప్రాణాలు కోల్పోయారు.
- మరి సైనికులే గనక లేకపోతే ఏమయ్యేదో తెలుసా...? ఉగ్రవాదులు, వేరే దేశాల వాళ్లూ వచ్చి మనల్ని ఏదో ఒకటి చేసేవాళ్లు. చదువుకొనేందుకు అభివృద్ధి చెందేందుకూ అడ్డుపడేవాళ్లు. హీరో అంటే చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను రక్షించేవాడు. మరి వందకోట్ల భారతీయులను రక్షిస్తున్న మన సైనికులు నిజమైన హీరోలే కదూ..
- మన సైన్యం మొత్తం సుమారుగా 15 లక్షల పైనే. వాళ్లలో కొందరు ఎప్పుడూ సరిహద్దుల దగ్గర పహారా కాస్తుంటారు. మరికొందరేమో ప్రకృతి విపత్తులు, మతకలహాలు, బాంబు పేలుళ్ల వంటి సందర్భాల్లో విధుల్లోకి దిగుతారు. వీళ్లని పారామిలటరీ దళాలు అంటారు.
- మనదేశానికి 14,880 కిలోమీటర్ల సరిహద్దు భూభాగం ఉంది. అక్కడ పనిచేసే సైనిక దళాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. దేశ సరిహద్దుల దగ్గర కొన్ని చోట్ల విపరీతమైన చలి ఉంటుంది. ఉదాహరణకు హిమాలయాలు.
- అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి (సియాచిన్ అని పిలుస్తారు) మనది. కొన్ని సార్లైతే అక్కడ -50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంత చలిని తట్టుకునేందుకు వాళ్లు భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసిన ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటారు. ఎత్తైన యుద్ధభూముల్లో యుద్ధం చేయడంలో మనసైనికులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు.
ఇక రాజస్థాన్ దగ్గర ఉండే దేశ సరిహద్దుల్లో అయితే విపరీతమైన ఎండ ఉంటుంది. మరికొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం, చిత్తడి నేలలు ఉంటాయి. అంతేకాదు కొండల మీద పాకడం, విమానాల నుంచి వేలాడటం లాంటి వాటిల్లో కఠిన శిక్షణ తీసుకుంటారు. యుద్ధ సమయంలోనూ హెలీకాప్టర్ల ద్వారా యుద్ధం చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక సైన్యం ఉంది.
- బ్రిటీష్ కాలంలో మన సైన్యానికి 'రాయల్ ఇండియన్ ఆర్మీ' అనే పేరు ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ విడిపోవడంతో అప్పటి ఆర్మీని రెండు భాగాలుగా చేశారు. అప్పటి నుంచీ 'ఇండియన్ ఆర్మీ'గా పేరుపెట్టుకున్నాం. జనవరి 15న భారత సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజే మన మొదటి ఆర్మీ జనరల్‌ను ఎన్నుకున్నాం.
- గెరిల్లా పోరాటాల్లో ప్రపంచంలోనే భారత సైన్యానికి సాటిలేదు.అమెరికా సైనికులకు కూడా ఈ యుద్ధ విద్యలో మన సైన్యం తర్ఫీదునిస్తోంది. మిజోరంలోని 'కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ స్కూల్' ఇందులో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో కేవలం ఆర్మీ వాళ్లకే కాదు, ఇతర పోలీసు విభాగాలకూ శిక్షణనిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఇండియన్ ఆర్మీ నాలుగో స్థానంలో ఉంది. అంతేకాదు మన సైనిక శిక్షణ ప్రపంచంలోనే కఠినమైంది.
Authorization