రాణీ పదేండ్ల ధనవంతుల పిల్ల. ఒకరోజు ''అమ్మా ఈ రోజు నా స్నేహితురాలు రూప పుట్టినరోజు కదా ఏం తీసుకెళ్లను'' అంది ఉత్సాహంగా. తన గ్రూపులో తనే ధనవంతురాలు. అందుకే అందరికంటే ఖరీదైనది తీసుకెళ్ళాలి అని అనుకుంది. అప్పుడే కదా గొప్ప అందరిలో.
అమ్మ ఒక పాకెట్ తెచ్చి ఇచ్చింది. ''ఏమిటమ్మా ఇది'' అడిగింది.
'' నీతి కథల పుస్తకాలు, బాల సాహిత్యం. పిల్లల భవిష్యత్తుకు పునాది వంటివి. మంచి సాహిత్యం వలన పిల్లలలో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది'' అంది.
రాణీకి చిరాకు వచ్చింది. ''కానీ అమ్మా ఇంత చవకైన బహుమతా? నా స్నేహితులు నవ్వుతారు వాళ్ళు వెండివి, డ్రెస్సులు తెస్తున్నారు. మనమేమో డబ్బున్నా ఇలాంటివి ఇస్తే ఎలా?'' అంది.
''ఇష్టమైతే ఇవి తీసుకెళ్లు లేకపోతే లేదు'' అంటూ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రాణీ కాసేపు అలాగే నిలబడిపోయింది. ఏడుపు కూడా వచ్చింది. కానీ ఏం చేస్తుంది? అమ్మ మాట అందంటే అంతే. ఇంక ఎంత చెప్పినా వినదు. అసలేమీ తీసుకెళ్ళకపోతే మరీ అవమానం కదా, అయినా మన ముందర విప్పి చూస్తారా ఏమిటి అనుకుని అవే పట్టుకెళ్ళింది. పార్టీ మానటం ఇష్టం లేదు.
అందరూ బహుమతులు అందజేస్తున్నారు. అయితే రూప ప్రక్కన నిలబడిన రూప తమ్ముడు ఉత్సాహంగా పాకెట్లు తెరిచి చూసేస్తున్నాడు. రూప అమ్మ వారిస్తున్నా వినటం లేదు. చాలా వరకు విలువైన బహుమతులు, టార్సు ఉన్నాయి.
రాణి బాధ దిగమింగుతూ, తన బహుమతి ఇచ్చింది. అవమానం తప్పదనుకుంది. కానీ చిత్రంగా ఆ పుస్తకాలు పిల్లలందరికీ నచ్చాయి. రూప, రూప తమ్మునికే కాక అందరికీ నచ్చాయి. రంగు రంగుల బోమ్మలతో ఆకర్షణీయంగా ఉన్నాయి కథలు అప్పుడే ఒకటి రెండు చదివేశారు కూడా పిల్లలు అడిగి తీసుకుని. ''చూశావా అబద్ధాలాడితే ఎన్ని తిప్పలో'' అంటోంది రాధిక. రూప ఫ్రెండ్ ఒక కథ చదివి ''అమ్మ మాట వినకపోతే ఎంత నష్టపోతారో చూడు ఈ కథలో'' అంటోంది జూలీ అనే మరో స్నేహితురాలు. రాణీకి చాలా సంతోషం వేసింది. రూప అమ్మ కూడా ''మంచి బహుమతి తెచ్చావమ్మా'' అని మెచ్చుకుంది.
రాణి ఇంటికొచ్చి సంతోషంగా విషయమంతా తల్లికి చెప్పింది. అమ్మ అంది ''పిల్లలకి బహుమతిగా నగలిస్తే దొంగల భయం, డబ్బులిస్తే చెడిపోయే అవకాశాలున్నాయి. ఖరీదైన బట్టలు బేధాల్ని చూపతాయి. తినేదిస్తే ఎంత ఖరీదైనా అరిగిపోతే మర్చిపోతారు. అందుకే పుస్తకాలు ఇచ్చాను. అవి శాశ్వతమైన బహుమతులు పిల్లలకి. ముఖ్యంగా ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల సాహిత్యం విలువ, పఠనాశక్తి పోయింది. అయితే పిల్లల మానసిక ఎదుగుదలకి మంచి పుస్తకాలు చదవటం తప్పనిసరి. అందుకే బహుమతిగా ఇచ్చాను'' అంది అమ్మ.
ఎంతైనా అమ్మ తెలివైంది కదూ!
- ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
Authorization