ఫ్రెండ్స్... ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? జాతీయ భద్రతా దినోత్సవం. అంటే ఏ విషయంలోనైనా, ఏ పని చేస్తున్నప్పుడైనా జాగ్రత్తగా వుండాలన్నమాట. ఏదైనా పని మీద బయటికి వెళ్తుంటే పెద్దవాళ్లు జాగ్రత్తలు చెప్తుంటారు. ఈ భద్రతా దినోత్సవం కూడా అలాంటిదే!
రోడ్డుమీద వెళ్తున్నా, ఏదైనా పెద్దపెద్ద మెషిన్ల మీద పని చేస్తున్నా కాస్త అజాగ్రత్తగా వుంటే ఏమవుతుంది? ప్రమాదాలు సంభవిస్తాయి. ఉదాహరణకు చాకుతో ఏ పండో కోస్తున్నారనుకోండి... అజాగ్రత్తగా వుంటే చేయి కోసుకునే ప్రమాదముంది. అలాగే రోడ్డు దాటేటప్పుడు కూడా... వచ్చేపోయే వాహనాలను చూసుకుంటూ రోడ్డు దాటాలి. లేదంటే ఏ వాహనమో వచ్చి ఢ కొంటుంది, దెబ్బలు తగులుతాయి. కర్మాగారాల్లో పనిచేసేవారు పెద్దపెద్ద మెషీన్లమీద పనిచేస్తుంటారు. అలాంటి సమయాల్లో కాస్త ఏమరుపాటుగా వుంటే చేతులు, కాళ్ళు మెషీన్లలో పడి ఆయా భాగాలను కోల్పోవలసి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా హాని కలగవచ్చు.
- ఇలాంటివన్నీ ఆలోచించిన మన భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల కార్మిక శాఖామంత్రుల సమావేశం నిర్వహించింది. అక్కడ ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల మీద చర్చించారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో అప్రమత్తత రావాలని నిర్ణయించారు. అందుకోసం పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్త్రలను, నివారణోపాయాలను తెలిపే విధంగా ప్రచారం అవసరమని భావించారు. దీనిమీద అనేక రోజుల పాటు చర్చించారు. అందరూ ఏకాభిప్రాయానికి రావటానికి చాలా రోజులే పట్టింది. చివరికి పారిశ్రామిక భద్రత మీద మొదటి సమావేశం 1965, డిసెంబర్లో ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులందరూ పాల్గొని... జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 'భద్రతా మండలి (నేషనల్ సేఫ్టీ కౌన్సిల్)' ప్రారంభించాలని నిర్ణయించారు.
- అయితే ఈ 'జాతీయ భద్రతా మండలి' ప్రారంభమైంది మాత్రం 1966వ సంవత్సరం, మార్చి 4వ తేదీన. ఈ భద్రతా మండలి ముఖ్యలక్ష్యం ఏమిటంటే... ఉద్యోగులైనా, సమాన్య ప్రజలైనా, ఎవరైనా సరే... వృత్తి జీవితంలో కానీ, తమ జీవన విధానంలో కానీ భద్రత, ఆరోగ్య రక్షణ గురించి అవగాహన పెంచుకుని ప్రమాదాలను నివారించడం, అందుకోసం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే అంశాలను చిన్న చిన్న షార్ట్ఫిల్మ్ల ద్వారా, డాక్యుమెంటరీల ద్వారా చూపిస్తారు. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారోత్సవాలను నిర్వహిస్తుంది ఈ సంస్థ.
- పారిశ్రామిక రంగాల్లో జరిగే ప్రమాదాల మీద అవగాహన కోసం మొదలు పెట్టినా... అగ్ని ప్రమాదాలు, రోడ్డుప్రమాదాల వంటి వాటి మీద కూడా ఈ సంస్థ అవగాహన కగిలిస్తుంది.
రహదారి భద్రతా దినోత్సవాలు, అగ్నిమాపక వారోత్సవాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు... లాంటివన్నీ భద్రతా మండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు.
- అయితే భద్రత మీద అవగాహన కలిగించడం వరకే ఈ సంస్థ బాధ్యత. జాగ్రత్తలు పాటించడం, అవగాహన కలిగి వుండటం ప్రతి పౌరుడి బాధ్యత. అప్పుడే ప్రమాదాలను నివారించనవాళ్ళమవుతాం. మరి పెద్దవాళ్ళు చెప్తుంటే విసుక్కోకుండా మీరూ జాగ్రతలు పాటిస్తారు కదూ!
Authorization