హాయ్ ఫ్రెండ్స్ ... ఈరోజు మనం కొన్ని వింతైన జీవుల గురించి తెలుసుకుందాం.. ఏమిటా వింత? అంటారా...మీరు ఎప్పుడైనా పారదర్శకమైక జీవుల్ని చూశారా..? అంటే శరీరమంతా గాజులా ఉండి, లోపలి భాగాలన్నీ చక్కగా కనిపిస్తుంటాయి. వాటిలో భూమ్మీద జీవించేవి కొన్నయితే, నీటిలో బతికేవి ఇంకొన్ని. అవెలా ఉంటాయో.. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..?
బార్టన్ స్ప్రింగ్స్ సాలమాండర్
ఇవి బల్లిలాంటి విష జంతువులు. ఆస్ట్రేలియాలోని బార్టన్ ప్రాంతంలో మాత్రమే, అదీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల్లో కనిపిస్తాయి. వీటికి ఊపిరితిత్తులుండవు. అందుకే ముదురు గోధుమ రంగులో ఉండే పలుచని చర్మం ద్వారా శ్వాసను తీసుకుని బతికేస్తాయి. గాజులా మెరుస్తూ ఉండే చర్మంలోంచి కడుపులో ఉండే గుడ్లు, తిన్న ఆహారం కూడా స్పష్టంగా కనిపిస్తాయి. 1997 నుంచి వీటిని అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో చేర్చారు.
జంపింగ్ గ్లాస్ స్పైడర్
నడుస్తున్నట్టు కాకుండా గెంతుతూ ఉండే ఈ సాలెపురుగులు ఈక్వెడార్ అడవుల్లో కనిపిస్తాయి. లేత పసుపు రంగులో ఉండే వీటి శరీరం నల్లని మచ్చలతో ఉంటుంది. చూసే వాళ్లకి గాజులాంటి వీటి శరీరాన్ని పసుపు ద్రవంతో నింపినట్టు కనిపిస్తాయి.
గ్లాస్ ఈల్స్
చిటికెన వేలుకంటే సన్నగా కనిపించే వీటిని అమెరికన్ ఈల్స్ అనీ అంటారు. మీటరు పొడవుండే ఈ చేపలకి అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. నదులు, ప్రవాహాలు, సరస్సుల్లో జీవించే ఈ గాజు చేపల సంతానోత్పత్తి ఎక్కువ. గ్లాస్ఈల్ తల్లిచేపలు విడతకు లక్షల్లో సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వీటిని పరిశ్రమల ద్వారా సాగు చేస్తుంటారు. ఇవి ఎంత పారదర్శకంగా ఉంటాయంటే.. ఏదైనా రంగు కలిగిన దాని మీద వీటి నుంచితే అవే రంగులో కనిపిస్తాయి.
గోస్ట్ ష్రింప్
రొయ్యజాతుల్లో ఇవొకటి. ఉప్పునీటిలో బతికే సూక్ష్మ జలచరాలివి. ఇవి ఏ రంగు ఆహారాన్ని తింటే ఆ రంగులో కనిపిస్తాయి. దానిక్కారణం వీటి శరీరం పారదర్శకంగా ఉండటమే. ఆకర్షణీయంగా ఉంటాయని వీటిని అక్వేరియంలో కూడా పెంచుకుంటారు.
టార్టాయిస్ షెల్ బీటిల్
ఆరుద్ర పురుగుల్లోనే ఇదో రకం. దీని శరీరం మామూలుగానే ఉంటుంది. తాబేలుకున్నట్టుండే పైచిప్ప మాత్రమే పారదర్శకంగా కనిపిస్తుంది. దానివల్ల ఇది తినడానికి పనికొస్తుందా, లేదా అని పురుగుల్ని తినే జీవులు కొన్ని తికమక పడుతుంటాయి.
సీ సాల్ప్
దక్షిణ మహాసముద్రంలో ఉండే ఈ జలచరాలు చూడ్డానికచ్చం రొయ్యల్లానే ఉంటాయి. కానీ రొయ్యల్లా వీటికి మీసాలు, కాళ్లు ఉండవు. 15 అంగుళాల వరకూ పెరుగుతాయి. శరీరం జిగురుగా ఉన్నందువల్ల నీటిలో జారుతూ ఈదుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరం తేటగా, స్వచ్ఛంగా ఉండి అవయవాలన్నీ కనిపిస్తుంటాయి.
బిగ్ స్కేట్
దీన్ని టేకి చేప అంటారు. వీటి మొహం మనిషి మొహాన్ని పోలి ఉంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద అక్వేరియాల్లో వీటిని ప్రధాన ఆకర్షణగా ఉంచుతారు. లేత బూడిద రంగులో ఉంటాయివి. శరీరం కింది భాగం వైపు వీటి అవయవాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
Authorization