ప్రతి రోజూ మన స్కూల్ బ్యాగులో ఉండేవేంటీ అంటే... పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్ అని ఠక్కున చెబుతారు. అందులో ఎంతో ముఖ్యమైంది ఎరేజర్.. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు ఎన్నో తప్పులు జరుగుతుంటాయి. వాటిని చెరిపేసే ఆయుధమే రబ్బర్. మరి ఇంత గొప్ప ఎరేజర్ని ఎవరు తయారు చేశారు.. ఎప్పుడు తయారు చేశారు అనే విషయాలు తెలుసుకుందామా...
- తప్పులన్ని కుప్పలు పోసినా.. ఒంటిచేత్తో తుడిపేస్తారు. అదే ఎరేజర్ మహిమ. మానవులు రాతతో చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుతున్న ఎరేజర్‌కు చాలా చరిత్రే ఉంది.
- పూర్వం పెన్సిల్, చార్కోల్, లెడ్ రాతల్ని తుడిపి వేయడానికి క్రస్ట్‌లెస్ బ్రెడ్‌ను ఉపయోగించేవారు. ఆ తరువాత రబ్బరు చెట్ల నుంచి వచ్చే జిగురుతో మొదట్లో ఎరేజర్‌ను సహజ సిద్ధంగా తయారు చేశారు.
- 1735లో చార్లెస్ డీ లా అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 'గమ్ ఎలాస్టిక్' పదార్థం లేదా 'కాట్చాక్' గురించి తెలుసుకొని దాని నమూనాలను యూరప్ పంపించాడు. ఇది ఉష్ణమండలంలోని రబ్బరు చెట్ల బెరడు కింద ఉత్పత్తి అవుతుంది. దీన్ని 'లాటెక్స్' అంటారు. ఇప్పటికీ ఎరేజర్‌ను సహజంగా తయారు చేయాలంటే లాటెక్స్‌ను ఉపయోగించే చేస్తారు.
- 1770, ఏప్రిల్ 15 తేదిన జోసఫ్ ప్రిస్ట్లే అనే తత్వవేత్త తొలిసారిగా ఎరేజర్‌ను ఉపయోగించాడు. ఇదే సంవత్సరం ఎడ్వర్డ్ నేర్నె అనే ఇంజనీర్ రబ్బర్ ధర్మాలను కనుగొనడంతో పాటు, దాన్ని యూరప్ దేశస్థులకు పరిచయం చేశాడు. దానికి రబ్బర్ అనే పేరును పెట్టింది ఈయనే.
- 1839లో చార్లెస్ గుడ్ఇయర్ 'వుల్కనైజేషన్' ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో మరింత మెరుగైన ఎరేజర్‌ను తయారు చేయగలిగారు. వుల్కనైజేషన్ అంటే వివిధ రసాయనాలను, సల్ఫర్‌ను ఉపయోగించి రబ్బర్‌ను మరింత ఎలాస్టిక్‌గా, మన్నిక గల వస్తువుగా తయారుచేయడం. రబ్బర్ వేడి వాతావరణంలో మెత్తగా, చల్లని వాతావరణంలో కొంచెం గట్టిగా ఉంటుంది.
- ఆ తరువాత1858లో ఫిలడెల్ఫియాకు చెందిన హైమన్ లిప్మన్ పెన్సిల్ వెనకాలే ఉండే ఎరేజర్‌ను తయారుచేయడంతో పాటు దీనిపై పేటెంట్ హక్కులు పొందాడు.
- మరో విశేషం ఏమిటంటే రబ్బర్‌ను తొలిసారి ఉపయోగించిన (1770లో) ఏప్రిల్ 15ను వరల్డ్ రబ్బర్ ఎరేజ్డేగా అమెరికాలో సెలబ్రేషన్స్ కూడా నిర్వహించుకుంటున్నారు.
- ప్రస్తుతం సింథటిక్, వినైల్, ప్లాస్టిక్, టర్పంటైన్, జిగురు మొదలైన పదార్థాలను ఉపయోగించి ఎరేజర్లను కృత్రిమంగా తయారుచేస్తున్నారు. అంతేకాదు ముచ్చట గొలిపే వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో వస్తూ పిల్లల మనసుదోచుకుంటున్నాయి.
Authorization