హొయాట్జిన్ ...ఇది చూడటానికి టర్కీ పక్షిలా ఉంటుంది. ఈ పక్షిని టర్కీ పక్షిని పక్కపక్కన పెట్టినా కూడా తేడా గుర్తించలేనంత పోలికలుంటాయి. ఇది చాలా విలక్షణమైన పక్షి. దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలలో ఇవి బాగా కనిపిస్తాయి. 25 అంగుళాల వెడల్పు, 1.78 పౌండ్ల బరువుతో ఉంటాయి. వీటి మెడ పొడవుగా ఉంటుంది. ఎరుపు, గోధుమ రంగుల మిశ్రమంలో చిన్న తల ఉంటుంది. ముఖం మాత్రం నీలి రంగులో, ఎర్రని కండ్లతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. శరీరమంతా ముదురు గోధుమ రంగు, తెలుపు పసుపు రంగు కలిసిన ఈకలతోనిండి ఉంటుంది. పది విడి విడి ఈకలతో నిండిన తోక కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం నీటి దగ్గరలో ఉన్న చెట్ల కొమ్మలపై గడుపుతుంది. పెద్ద పెద్ద రెక్కలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే ఎగురుతుంది. మిగతా ఎగిరే పక్షుల లాగ కాకుండా, దీని పొట్ట మీది కండరాలు బలహీనంగా ఉంటాయి. అంతేకాకుండా వీటి రెక్కలు మరీ పెద్దవిగా ఉండటం కూడా ఇవి ఎగరలేకపోవడానికి మరో కారణం. చాలా అరుదైన ఈ పక్షులు పూర్తిగా శాకాహారులు. ఆకుపచ్చగా ఉండే రకరకాల చెట్ల ఆకులను తింటాయి. రోజులో నాలుగు గంటల సేపు ఆహారం తినడంలో గడుపుతాయి. ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం మరోసారి తింటాయి. కాలిగోళ్ల సాయంతో చెట్లు ఎక్కుతాయి. ఆహారం కోసం చెట్లు ఎక్కుతున్న సమయంలో ఆ గోళ్లే చెట్టు మీద నుండి నీళ్లలోకి పడకుండా కాపాడుతాయి. గ్రద్ద వంటి పెద్ద పెద్ద పక్షులు వీటిని వేటాడుతాయి. 10-50 వరకు గుంపుగా జీవిస్తాయి. గుడ్లు పెట్టే సమయంలో చెట్ల మీద గూళ్లు కడతాయి. ఈ గూడు పొడవు 5-21 అడుగుల వరకు ఉంటుంది. రెండు నుంచి ఐదు దాకా గుడ్లు పెడతాయి. గుంపులో ఉన్న పక్షులన్నీ కలిసి ఈ పిల్లలను పెంచుతాయి.
Authorization