జంతు ప్రపంచంలో అత్యంత ఎత్తైన జిరాఫీ. ఇది 5 మీటర్ల (16-18 అడుగుల) ఎత్తుంటుంది. దీని కాళ్ల పొడవే ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. అంత పొడవైన కాళ్లతో ఇవి మామూలుగా నడిచినా ఆ వేగం గంటకు 16 కి.మీ. కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇక పరుగెత్తే సమయంలో ఆ వేగం గంటకు 55 కి.మీ. వరకు చేరుకుంటుంది. జిరాఫీకి ఉండే పొడవు కాళ్లు, మెడ కారణంగా అది నీళ్లు తాగాలంటే ముందు రెండు కాళ్లను బాగా చాపి, మెడను క్రేన్లాగా వంచాల్సి ఉంటుంది. అందుకే అది చాలా అరుదుగానే నీళ్లు తాగుతూ, తనకు అవసరమైన తేమను మొక్కల నుంచే స్వీకరిస్తుంది. అవి చాలా ప్రశాంత జీవులే అయినా ఒక్కోసారి రెండు మగ జిరాఫీలు తమ పొడవైన మెడలతోనే పోరాటం చేస్తాయి. ఒక్కోసారి ఈ పోరాటం 20 నిమిషాలకు పైగా సాగుతుంది.