భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుందని, అలా తిరిగే క్రమంలో భూమి చలికాలంలో సూర్యుడికి చాలా దూరంగానూ, వేసవికాలంలో సూర్యుడికి చాలా దగ్గరగా వస్తుందని, అందుకే వేసవి కాలంలో వేడిగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అది నిజం కాదు. వాస్తవానికి భూమి చలి కాలంలో కన్నా వేసవి కాలంలోనే సూర్యుడికి ఎక్కువ దూరంలో ఉంటుంది. ఉత్తరార్ధగోళం చలితో వణికిపోయే జనవరిలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగానూ ఎండలు తీవ్రంగా ఉండే జూలైలో సూర్యుడికి దూరంగా ఉంటుంది. రుతువులు భూమి ఆయా కాలాల్లో సూర్యుడికి ఎంత దూరంలో ఉంటుంది అన్న దానిని బట్టిగాక, భూమి మన అక్షంపై ఒక వైపుకి వాలి ఉండటంపై ఆధారపడి ఉంటాయి. భూమి ఒక్క అక్షం 23.5 డిగ్రీలు పక్కకు వాలి ఉంటుంది. దీని మూలంగా సూర్యకిరణాలు కొన్ని నెలల్లో ఉత్తరార్ధగోళంపై సూటిగా పడితే, మరికొన్ని నెలల్లో దక్షిణార్థగోళంపై సూటిగా పడతాయి. సూటిగా పడినపుడు ఎండాకాలం, ఏటవాలుగా పడినపుడు శీతాకాలం వస్తాయి. ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు సూటిగా పడినపుడు దక్షిణార్ధగోళంలో ఏటవాలుగాను, అక్కడ సూటిగా పడినపుడు ఇక్కడ ఏటవాలుగాను పడతాయి.