హయ్ నేస్తాలూ..! ఈత కొట్టడమంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరికీ ఇష్టమే. మన వ్యాయామాలలోనూ, ఆడే ఆటల్లోనూ ఈత చాలా ముఖ్యమైనదట. శరీరం మొత్తానికి లాభం చేకూర్చడంలో దీన్ని మించిన క్రీడ లేదని నిపుణులు చెబుతున్నారు. మరి దాని విశేషాలు, లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చదివేద్దామా!
- 1800 సంవత్సరంలో ఈత క్రీడగా గుర్తింపు పొందింది. అంతకుముందు, అంటువ్యాధులు వ్యాపిస్తాయని భయంతో ప్రజలు నీళ్లకు దూరంగా ఉండేవారు.
- 1896లో ఈతకు ఒలింపిక్స్లో స్థానం దొరికింది. అప్పట్లో పోటెత్తే సముద్రంలో ఈ పోటీలు జరిగేవి. 1948 నుంచి కొలనుల్లో పోటీలుపెట్టడం మొదలుపెట్టారు.
- పొట్టి జుట్టు వాళ్లు వేగంగా ఈత కొట్టేస్తారు. పొడుగు జుట్టు వల్ల ఘర్షణ ఎక్కువై వేగంగా ఈదలేం. అందుకే పోటీల్లో క్రీడాకారులందరూ తప్పనిసరిగా టోపీ పెట్టుకుంటారు.
- అలసిపోకుండా ఈత కొట్టాలంటే 'వేరుశనగ పప్పు' తినాలి. మంచి నీళ్లలో కంటే ఉప్పునీళ్లలో తేలికగా తేలతాం. ఉప్పు ఎక్కువగా ఉండే 'మృత సముద్రం' లో ఈత కొట్టకపోయినా తేలుతూనే ఉంటాం. ఆ నీళ్లలో అంత ఎక్కువ ఉప్పుంటుంది మరి.
- ఈతలో మనసుకు, శరీర అవయవాలకు మధ్య పొంతన కుదరాలి. నీటిలో తేలేటట్టు చేసే కదలికలపై పట్టు సాధించాలి. ఈ మెళకువలన్నీ శిక్షకులకే తెలుస్తాయి. కాబట్టి, అనుభవమున్న శిక్షకుడిని, శుభ్రత పాటించే కొలనును ఎంచుకోవాలి.
- నీళ్లు మరీ చల్లగా ఉంటే, గుండె వేగం పెరుగుతుంది. దాంతో, మనకు తెలియకుండానే నోరు తెరుస్తాం. గాలితో పాటూ నీళ్లనూ పీల్చేస్తాం. ఇది ప్రమాదం. చల్లటి నీళ్లకు కండరాలు కూడా బిగుసుకుంటాయి. ఈత కొట్టటం కష్టమవుతుంది. కాబట్టి, నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడే కొలనులో దిగండి.
- పిల్లలకోసం ప్రత్యేక కొలనులు ఉంటాయి. తక్కువ లోతుండే ఈ కొలనులు ఈతకి సురక్షితమైనవి. అంగుళాల్లో లెక్కించేలా వీటిలో 'లోతు పట్టిక' ఉంటుంది. దీన్ని బట్టి తక్కువ లోతుని ఎంచుకోవచ్చు.
- మొదట కొలను వాతావరణానికి అలవాటు పడాలి. మొదటిరోజు కొలనులోకి దిగి గోడ ఆధారంతో నీట్లో నడుస్తూ గడపాలి. అప్పుడు నీటి భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- నీళ్లపై తేలేలా చేసే 'గాలి పరుపు, రింగు' లాంటివి మునిగిపోకుండా కాపాడుతాయి. ఈత నేర్చుకునే మొదట్లో ఇవి తప్పనిసరి.
- ఈత దుస్తులు, టోపీ ఈతకు సౌకర్యంగా ఉంటాయి. టోపీ వల్ల జుట్టు తడవకుండా ఉంటుంది. చెవుల్లోకి నీళ్లు కూడా వెళ్లవు. ఈత కొలనులో సూక్ష్మక్రిముల్ని చంపడానికి 'క్లోరిన్' కలుపుతారు. ఈ నీటి వల్ల కండ్లు మండుతాయి. కాబట్టి ఈత కండ్లజోడు కూడా తప్పనిసరి.
- ఈతకు గంట ముందు ఆహారం తినకూడదు. పొట్ట నిండుగా ఉంటే, మత్తుగా ఉంటుంది. శిక్షణకు ఒకేసమయాన్ని పాటించాలి. కొలను నుంచి ఇంటికివెళ్లగానే శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి.
Authorization