చెవులు, తోక, కండ్లు, ఒళ్లు, మీసాలు చూసి మొదట్లో జీవ శాస్త్రవేత్తలు దీన్ని పిల్లి అనుకున్నారు. కానీ ఇది పాండా జాతికి చెందినదని తెలిసింది. ఇవి నేపాల్, భూటాన్, చైనా, లావోస్, మయన్మార్ దేశాల్లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తుంటాయి. ఎర్రని బొచ్చువల్ల రెడ్ పాండా అని, కాస్త నక్కలా ఉండటం వల్ల 'ఫైర్ ఫాక్స్' అని అంటుంటారు. పుట్టినప్పుడు వీటికి కండ్లు కనిపించవు. చెవులు వినిపించవు. బొచ్చు గ్రే కలర్లో ఉంటుంది. ఎదిగే కొద్దీ చూపు, వినికిడి వస్తాయి. బొచ్చు ఎరుపురంగులోకి మారుతుంది. జీవిత కాలంలో 89% చెట్ల మీదే గడుపుతాయి. ఎంతోతప్పనిసరి అయితే తప్ప కిందికి దిగవు. ప్రధాన ఆహారం వెదురు ఆకులు. జతకట్టే సమయంలో తప్ప ఇవి ఎవ్వరితోనూ కలవవు. ఒంటరిగానే ఉంటాయి. ఉదయం లేచినప్పుడు హుషారుగానే ఉంటాయి. సమయం గడిచేకొద్దీ ఎందుకో స్లో అయిపోతాయి. మళ్లీ సాయంత్రం అయ్యాకే హుషారొస్తుంది. నిద్ర అంటే మహా ఇష్టం. ఒక్కోసారి తినడానికి తప్ప దేనికీ లేవకుండా నిద్రపోతూనే ఉంటాయి. చిరుత పులులు, అడవి కుక్కలకు రెడ్పాండాలు ఇష్టమైన ఆహారం. దాంతో వీటి సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.