చేప పిల్లకు ఈత నేర్పాలా! అంటారు పెద్దవాళ్లు. అంటే నీటిలోనే పుట్టే చేపకు పుట్టుకతోనే ఈత దానికదే వచ్చేస్తుంది. అయితే ఈతరాని చేపలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాలి మరి. కొన్ని జాతుల చేపల్లో పిల్లలకే కాదు. తల్లులకూ, తండ్రులకూ కూడా ఈతరాదు.
హ్యాండ్ ఫిష్
ఈతరాని చేపల్లో హ్యాండ్ ఫిష్లు ముఖ్యమైనవి. ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా దేశ సముద్రాల్లో నివసిస్తాయి.సముద్రపు అడుగుభాగంలో చేతులతో నడుస్తాయి. అంటే మొప్పల స్థానంలో వీటికి బలమైన చేతుల్లా కనిపించే కండరాలు బయటకు పొడుచుకువచ్చి ఉంటాయి. మొప్పలు లేని కారణంగానే ఇవి సరిగా ఐదంగుళాల పొడవుంటాయి. నత్తల్లాంటి చిన్న చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఓచోట కూర్చొని ఉన్నట్లుగా ఉండటానికే ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. 1980కు ముందు టాస్మానియా ఆగేయ తీరప్రాంతంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడేవి. కానీ రానురాను వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అరుదుగా, చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి... ఈ నడిచే చేపల జాతిని రక్షించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.
ఫ్రాగ్ ఫిష్
ఫ్రాగ్ఫిష్ని చూడండి ఎలా నడస్తుందో! ఇది తన ప్రాణ రక్షణ కోసం ఏ ప్రదేశంలో ఉంటే ఆ రంగులోకి మారిపోతుంది. ఊసరవెళ్లికి తాత ఇది. ఇది మారిపోయిందంటే అక్కడ ఒక చేప ఉన్నట్లే మనకు తెలియదు. నాచు, రాళ్లను అన్నింటినీ కప్పేసుకుంటుంది. ఈ చేపలు కూడా కదలకుండా ఒకేచోట ఉండటానికే ఇష్టపడుతుంది.
బ్యాట్ ఫిష్
బ్యాట్ ఫిష్లకు భుజాల్లాంటి దృఢమైన మొప్పలుంటాయి. వాటితో సముద్రపు అడుగు భాగంలో గబగబా నడిచేస్తాయి. అలా వీటిని చూస్తే అచ్చం గబ్బిలం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి బ్యాట్ ఫిష్ అంటారు. ఇవి మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉంటాయి. నీటిలోఉండే చిన్న చిన్న జీవులు వీటి ఆహారం. వెచ్చనైన లేదా సమశీతోష్ణ వాతావరణం కలిగిన సముద్రాల్లో ఇవి నివసిస్తాయి. గల్ఫ్ తీరంలో డీజిల్, పెట్రోల్ అవశేషాలు సముద్రంలో కలుస్తుండటంతో ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్టన్లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర తీరంలో కనుగొన్నారు.
బ్లాబ్ ఫిష్లు
ఇవి చాలా లావుగా, ఒక జిగురు పదార్థంలా ఉంటాయి. అంతేకాక వీటి శరీర సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉంటుంది. అందువల్ల అవి సముద్రపు అడుగుభాగంలో తేలియాడుతూ ఉంటాయి. అంటే ఇవి ఈదవన్నమాట. అవి ఉన్నచోటుకే ఏవన్నా నత్లల్లాంటి జీవులు వచ్చినప్పుడు తిని జీవిస్తుంటాయి.
Authorization