అనగనగా ఒక మేక పిల్ల! ఒక రోజు అది మంద నుంచి తప్పిపోయి అడవిలోకి వెళ్లిపోయింది! ఎత్తయిన చెట్లు, దట్టమైన పొదలు చూసి భయపడిపోయింది. అడవిలో నక్కలు, తోడేళ్లు, పులులు, సింహాలు ఉంటాయని, అవి గానీ మేకలను చూస్తే వదలవనీ, చంపి తింటాయనీ ఎప్పుడో విన్నది. అంతలో వాళ్ల అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. ''ఆపద ఎదురయ్యేటప్పుడు పిరికితనం కూడదు. మన భయం అవతలి వారికి బలమవుతుంది. ధైర్యవంతులే ఆపద నుంచి తప్పించుకోగలరు''. వెంటనే ధైర్యం కూడదీసుకుంది మేకపిల్ల. అంతలో ఒక నక్క ఎదురుపడింది. మేకపిల్లను చూసి ఆ నక్క ''ఏం అదృష్టం నాది?! నేను మేక మాంసం తిని ఎన్నాళ్లయిందో. ఏ అర్ధరాత్రో ఊరుమీదపడి మేకను సంపాదించాలనుకున్నాను. కానీ విచిత్రం! నువ్వే నాకు ఎదురుగా వచ్చావు!'' అని మీదకు రాబోయింది.
మేకపిల్ల ''ఆగాగు! నీ మంచికే చెబుతున్నాను. మా అమ్మ నా వెనుకనే వస్తోంది. నన్నేమైనా చేశావా! ఒక్క అరుపు అరిచానంటే చాలు! మా అమ్మ వాడి కొమ్ములతో నీ డొక్క చీరుస్తుంది!'' అంది. మేకపిల్ల మాటలు విన్న నక్కకు దురాశ కలిగింది. ''ఈ మేక పిల్ల మాంసం ఏం రుచిగా ఉంటుంది? దీని తల్లి మాంసమయితే కొవ్వుపట్టి మంచి కండగా ఉంటుంది. తింటే దీని తల్లి మాంసమే తినాలి.' అని మనసులో అనుకుంది. ఏం దురాలోచన లేనట్టు, మేకపిల్లతో 'అమ్మో! మీ అమ్మ వచ్చిందా! మేక కొమ్ములు చూస్తేనే నాకు భయం'' అని మేకపిల్లను వదిలి తల్లిమేక కోసం మాటువేసేందుకు ముందుకు పోయింది.
ప్రాణగండం తప్పినందుకు మేకపిల్ల హమ్మయ్య అని అనుకుంది. మరి కొంచెం దూరం వెళ్లే సరికి ఒక తోడేలు ఎదురైంది. తోడేలు కూడా మీదకు ఉరకబోతుంటే మేకపిల్ల ''ఆగాగు! మీ మంచికే చెబుతున్నాను. మా అమ్మ నా వెనుకనే వస్తోంది. నన్నేమైనా చేశావా? జాగ్రత్త! ఒక్క అరుపు అరిచానంటే చాలు! మా అమ్మ వచ్చి, తన వాడి కొమ్ములతో నీ డొక్క చీరగలదు!'' అని ధైర్యంగా చెప్పింది.
తోడేలు మేకపిల్ల మాట విని ''మేక నన్ను చంపగలదా? పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ?! ఎంత పెద్ద మేకైనా నా ముందు బలాదూరే! ఈ మేకపిల్ల తల్లిని చంపి హాయిగా మాంసం ఆరగిస్తాను! ఈ పిల్ల సంగతి తరువాత చూస్తాను.. అనుకొని తల్లిమేక కోసం పరుగెత్తింది.
హమ్మయ్య! గండం గడిచింది... అని ఊపిరి పీల్చుకుంది మేకపిల్ల. అడవి దాటడానికి వేగంగా అడుగులు వేయసాగింది. ఈసారి పెద్ద ఆపదే ఎదురొచ్చింది! చింత నిప్పుల కండ్లతో పులి మేకపిల్ల ముందు నిలబడింది. మేకపిల్ల బెదరలేదు. ''పులిరాజా నమస్కారం'' అంది. ''ఈ అడవికి మీరేనా రాజు?'' అని అడిగింది.
పులి మేకపిల్ల మాటలు విని పొంగిపోయింది. ఈ మేకపిల్ల నన్ను ఈ అడవికి రాజును చేసేసిందే అని సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది. లేని ఠీవిని తెచ్చుకొని ''ఔను! ఈ అడవికి నేనే రాజును!'' అని బడాయిగా చెప్పింది పులి!
మేకపిల్ల వినయంగా ''పులిరాజా! మీరు న్యాయమూర్తులని విన్నాను.. నన్ను కాపాడండి!'' అని అడిగింది.
''నీకు వచ్చిన ఆపదేమిటి?'' రాజసం ఒలకబోస్తూ పులి ప్రశ్నించింది.
మేకపిల్ల ఇంకా వినయంగా ''రాజా.. ఏమని చెప్పను నేను? ఉదయాన్నే నేనూ, మా అమ్మ అడవి చూడడానికి వచ్చాం. దారిలో నక్క, తోడేలు మమ్ము అడ్డగించాయి. నేనెలాగోతప్పించుకొని న్యాయం చెయ్యమని అడగడానికి మీ దగ్గరికి వస్తున్నాను. అదృష్టం! మీరే ఎదురయ్యారు! మా అమ్మను కాపాడండి!'' అని వేడుకొంది.
పులి ఆలోచనలో పడింది. ''లేతగా ఉన్న ఈ మేక పిల్ల మాసం తిని నేనెందుకు తృప్తి పడాలి? నక్కను, తోడేలును బెదరగొట్టి తల్లి మేకనే తింటాను'' అని అనుకొని ముందుకుపోయింది.
అంతలో సింహగర్జన భీకరంగా వినిపించింది. పులితో సహా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురయిపోయాయి. దిక్కుతోచక మేకపిల్లా పరుగుతీసింది. అడవి దాటగానే మేకల మంద ఎదురయింది. మందలోచేరి మేకపిల్ల తన తల్లిని చేరుకుంది.
Authorization