హయ్ చిన్నారులూ..! మనం పగలంతా మేలుకుని ఎంచక్కా రాత్రుళ్లు నిద్రపోతాం. కానీ, కొన్ని జంతువులు పగలంతా నిద్రపోయి రాత్రవ్వగానే మేలుకుంటాయి. ఎందుకు అంటారా? చీకట్లో శత్రుజీవుల నుండి రక్షించుకోవడానికే ఆ ఏర్పాటు. అంతేకాదు అప్పుడే అవి ఆహారాన్ని కూడా సేకరించుకుంటాయి. అలాంటి కొన్ని వింత జీవుల విశేషాలు ఇప్పుడు చదివేద్దామా!
రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటారు. ఈ జంతువుల్లో వినడానికి, వాసన పీల్చడానికి, చూడటానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివద్ధి చెంది ఉంటాయి.
ఇంకా మన చుట్టూ కనిపించే నిశాచరులు - పిల్లులు, ఎలుకలు, క్వాటిల్ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి.
రకూన్
రాత్రివేళ నెమ్మదిగా సంచరించే ఈ నిశాచర జీవి కంగారూ, కొవాలా, ఉడతలకు దగ్గరి బంధువు. అందుకే దీన్లో వాటి లక్షణాలన్నీ ఉంటాయి. ఇది వాసన పసిగట్టడంలో నేర్పరి కూడా. వాసనతో దగ్గర్లోని జంతువుల్ని కనిపెట్టి వేటాడుతుందిది. చెట్టు తొర్రలు, దుంగలు, రాతి పగుళ్లే వీటి నివాస స్థలాలు. మిగతా నిశాచర జంతువుల్లాగే రాత్రుళ్లు వీటి కండ్లు మెరుస్తాయి. చీకట్లో చూపు ఉండటం కోసమే ఈ ఏర్పాటు.
గుడ్లగూబలు
గుడ్లగూబలు మనలా కండ్లు తిప్పలేవు. ఎటువైపు చూడాలన్నా తలను పూర్తిగా తిప్పి చూడాల్సిందే. అందుకే వీటి తలలు 270 డిగ్రీల కోణంలో తిరగగలుగుతాయి. వీటికి కంటిచూపు, వినికిడి శక్తి కూడా ఎక్కువే. మిగతా నిశాచర జంతువుల కంటే గుడ్లగూబలు మరింత రహస్యంగా జీవిస్తాయి. చిత్రమైన శబ్దాలు చేస్తూ నిశ్శబ్దంగా ఎగురుతూ వేటాడుతాయి. ఈ చిత్రమైన లక్షణాల వల్లే మనం వీటికి విపరీతంగా భయపడుతుంటాం.
గబ్బిలాలు
ఇవి తలకిందులుగా గుహలు, చెట్టు తొర్రల్లో వేలాడుతూ జీవిస్తాయి. ఇవి ప్రతిధ్వని ఆధారంగా జంతువుల్ని వేటాడుతాయి. అంటే, వీటి ఆరుపు దగ్గర్లోని జీవిని తాకి తిరిగి వాటిని చేరుకునే తీవ్రతను బట్టి దూరాన్ని, ఆకారాన్ని వేగాన్ని అంచనా వేస్తాయి. ఈ వివరాల్ని చిటికెలో తెలుసుకుని వేటాడటం గబ్బిలాల ప్రత్యేకత. ఈ లక్షణం ఉండబట్టే, ఒక్క గంటలో వెయ్యి దోమల్ని వేటాడి గుటుక్కుమనిపిస్తాయి.
మిణుగురు పురుగులు
వర్షాకాలం, శీతాకాలంలో మిణుగురు పురుగులు కనిపిస్తుంటాయి కదా! అవి రాత్రిపూట మిణుకు మిణుకుమంటూ పచ్చని కాంతితో కదిలే దీపాల్లాగా ఉంటాయి. మిణుగురు పురుగులు వేడి లేకుండా వెలుతురునిస్తాయి. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే కొన్ని రసాయన చర్యలు. పక్షుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మిణుగురు పురుగులు కాంతిని విరజిమ్ముతాయి. ఈ వెలుగు, ఆడ, మగ పురుగులు జతకట్టడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆర్మడిల్లో
ఆర్మడిల్లోకు కంటిచూపు తక్కువ. కానీ ఇది వాసనను బ్రహ్మాండంగా పసిగట్టగలదు. పదునైన కాలిగోళ్లతో భలేగా గుంటలూ తవ్వగలదు. ఒంటినిండా గట్టి ఫలకాలతో యుద్ధ సైనికుడిగా ఉండే ఈ నిశాచర జీవికి భయం కూడా ఎక్కువే. భయపడ్డప్పుడు బంతిలా గుండ్రంగా చుట్టుకుపోతుందిది. అందుకే దీనిపై ఏ అడవి జంతువూ దాడి చేయలేదు. చీమలు, చెదపురుగుల్ని తిని బతికే ఈ జంతువు బొరియలో రోజుకి 16 గంటలు నిద్రపోతుంది. కండ్ల కంటే మెడ బాగా తిప్పగలదు.