పిల్లలూ పార్క్ ఎక్కడైనా నేలమీదే ఉంటుంది కదా! అంటారా! కానీ ఓ పార్క్ 6 నెలలు నీళ్లలో దాక్కుంటే, మిగతా 6 నెలలు నేల మీదికి వస్తుందట. ఇదేంటో విచిత్రంగా ఉంది కదా! మరింతకీ ఆ పార్క్ ఎక్కడుందో దాని రహస్యమేంటో తెలుసుకుందామా...
- దీనిపేరు గ్రూనర్ సీ పార్క్. అంటే ఆకుపచ్చని సరస్సు/ ఉద్యానవనం అని అర్థమన్నమాట. ఇది ఆస్ట్రియాలోని ట్రాగొయిస్కు సమీపంలో ఉంది. ఈ పార్క్ చుట్టూ మంచుకొండలుంటాయి. చూడ్డానికి చాలా అందంగా చుట్టూ పచ్చని చెట్లతో కళకళలాడుతుంటుంది. ఇందులో మిగతా పార్కుల్లోలానే కూర్చోడానికి బల్లలు, అక్కడక్కడ విగ్రహాలు, పచ్చిక బయళ్లతో చాలా బాగుంటుంది. ఇందులో ఆరడుగుల లోతున్న చిన్న సరస్సు కూడా ఉంది.
- చలికాలమంతా పార్కులా బాగానే ఉంటుంది. కానీ ఎండాకాలం మొదలైతే ఉంటుంది అసలు కథ. ఈ పార్కు చుట్టూ ఉన్న మంచుకొండలు కరిగి ఆ నీరంతా వచ్చి చేరుతుంది. దాంతో పార్కులోని సరస్సులో నీటిమట్టం పెరుగుతుంది. ఇంకేముంది ఆరడుగుల సరస్సు నలభై అడుగుల సరస్సుగా మారిపోతుంది. పార్కులో ఉన్నవన్నీ నీళ్లలో మునిగిపోతాయి. అప్పుడిక పార్కుకు వచ్చిన పర్యాటకులు ఎంచక్కా స్కూబా డైవింగ్ చేస్తారు. ఆరునెలలు ఇలానే సాగుతుంది. మళ్లీ 6 నెలలకు నీళ్లన్నీ ఇంకిపోయి యథావిధిగా పార్కులా కనబడుతుంది. ఇలా ఒకే ప్రాంతం రెండు రకాలుగా ఉపయోగపడుతున్నందుకు అక్కడివాళ్లంతా భలే ఆనందిస్తున్నారు.
Authorization