సబ్బు ఏ రంగులో ఉన్నా దాన్ని కొద్దిగా నీళ్లతో కలిపి రుద్దినప్పుడు వచ్చే నురగ మాత్రం రంగుల్లో లేకుండా తెల్లగానే ఉంటుంది. సబ్బు తయారు చేసేటప్పుడు ద్రావణంలో రంగు, సువాసన ద్రవ్యాలు చేరుస్తారు. ఆ ద్రావణం గట్టిపడి రంగు సబ్బుగా తయారవుతుంది. నురగ అనేది చిన్న సబ్బు బుడగల కలయికతో ఏర్పడుతుంది. సబ్బు బుడగ గుండ్రని బంతి లాగా ఉంటుంది. ఇది సబ్బు ద్రావణంలో ఏర్పడిన పలుచనిపొర. సబ్బు ద్రావణంలో తలతన్యత ఉంటుంది. అందువల్ల నురగ సాగదీసినట్లు అయి, అంతటా వ్యాపిస్తుంది. సబ్బు ద్రావణానికి, సమాన ఘనపరిమాణంలో ఉన్న నీటి కంటే, నురగలోని మొత్తం ఉపరితలం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రంగు సబ్బులోని పలుచని పొరలో స్వల్పంగా కలిసి ఉన్న రంగు ఛాయ అణచివేయబడుతుంది. సబ్బు నురగ పారదర్శకంగా ఉంటుంది. దీని కాంతికరణాలు తాకి పలు కోణాలలో వెదజల్లబడుతాయి. దీనివల్ల నురగ తెల్లగా కనబడుతుంది