ఒక ఆకలి నక్క కుందేలును చంపి హడావిడిగా తినేసింది. దాంతో, ఓ పొడవాటి ఎముక దాని గొంతుకు అడ్డుపడింది. నొప్పితో విలవిలలాడిపోయింది నక్క. ఇంతలో దానికి అటుగా వెళ్తున్న కొంగ కనిపించింది. దాన్ని దగ్గరికి పిలిచి గొంతులో ఇరుక్కున్న ఎముకను బయటకు లాగితే బోలెడన్ని చేపలిస్తానని ఆశపెట్టింది నక్క. దాంతో, అత్యాశకు పోయిన కొంగ నక్క గొంతులోని ఎముకను తన పొడవాటి ముక్కుతో బయటకు లాగేసింది. నక్క హమ్మయ్య! అని ఊపిరిపీల్చుకుంది. తర్వాత, కొంగ తనకిస్తానన్న చేపల గురించి ఆశగా అడిగింది. అప్పుడా తుంటరి నక్క, 'గొంతులో తలదూర్చినప్పుడు నీ తలను నమిలేయకుండా వదిలేశాను, సంతోషించు! అంటూ వెళ్లిపోయింది.