10వ తరగతి విద్యార్థులకు (దానశీలము) అనే పాఠాన్ని బోధిస్తున్నారు ఉపాధ్యాయులు తిరుమలేశం గారు. బలి చక్రవర్తి వామనునికి చేసిన దానాన్ని వివరిస్తూ, శిబి చక్రవర్తి, రంతి దేవుడు, జీమూతవాహనుల కథలకనూ బోధిస్తాడు. ప్రతి ఒక్కరూ త్యాగబుద్ధిని, దాన గుణాన్ని అలవరచుకోవాలని, ఆడినమాట తప్పరాదని హితబోధ చేస్తారు గురువుగారు. తాను చెప్పిన పాఠం విద్యార్థులు ఏ మాత్రం ఆకళింపు చేసుకున్నారో త్వరలో పరీక్షిస్తానని, ఉత్తమ విద్యార్థికి మంచి బహుమతి ఉంటుందని ప్రకటిస్తారు తిరుమలేశం గారు.
విద్యార్థులలో చాలా మంది ఎలాగైనా తాము నెగ్గాలని పాఠశాల గ్రంథాలయం నుండి, తమ ఊరి గ్రంథాలయం నుండి దాన గుణ శీలుర చరిత్రలను చదువుతారు. ఇంతలో ముందుగా అనుకున్న ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థులు విహారయాత్రకు వెళ్లే సమయం సమీపిస్తుంది. విద్యార్థులంతా విహారయాత్రకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తూ ఖర్చుల నిమిత్తం ఉపాధ్యాయులకు డబ్బులనిస్తారు.
ఒక్క సతీషు అనే విద్యార్థి విహారయాత్రకు రానని అన్నాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా ఆశ్చర్యపోయారు. చదువుతోపాటు ఆటపాటలు, అన్ని రకాల కార్యక్రమాల లోనూ అందరికంటే చురుకుగా ఉండే సతీష్ విహారయాత్రకు ఎందుకు రాలేకపోతున్నాడు. ఉపాధ్యాయులు ఎంత బతిమాలినా సతీష్ ఒప్పుకోలేదు. విహారయాత్రకు వెళ్లే రోజుకు ముందురోజు విహారయాత్రకు వెళ్లే విద్యార్థులతో ఉపాధ్యాయులు సమావేశం అయ్యారు. విద్యార్థులకు తగిన సూచనలు చేశారు. సమావేశం అనంతరం శ్రీశ, గౌరీశ అనే విద్యార్థులు తిరుమలేశం మాస్టారును కలుస్తారు. ''గురువుగారూ! మా కారణం చేతనే సతీష్ విహారయాత్రకు రాలేకపోతున్నాడు. పేద విద్యార్థులమైన మేము విహారయాత్రకు ఆసక్తి చూపలేకపోయాము. సతీష్ ఏనాటి నుంచో తాను కూడబెట్టుకుంటున్న డబ్బులను మా ఇద్దరికీ ఇచ్చి విహారయాత్రకు వెళ్లమన్నాడు. మేము వద్దని బతిమాలినా డబ్బులు తీసుకోకుంటే మన స్నేహం మీద ఒట్టని మరీ డబ్బులు ఇచ్చాడు'' అని చెప్పారు. తిరుమలేశం గారు సతీషుని పిలిపించి ''ఎందుకిలా చేశావు అని అడిగాడు.
''గురువుగారూ! ఈ దాన గుణం మీరు నేర్పినదే! నిజంగా దానగుణంలో ఉన్న సంతృప్తి ఎంత గొప్పగా ఉంటుందో తెలిసివచ్చింది'' అన్నాడు సతీష్. అప్పుడు తిరుమలేశం ''శభాష్! నా పరీక్షలో నీవే గెలిచావు. నేను చెప్పిన పాఠాన్ని ఆకళింపు చేసుకోవడం అంటే అందలి నీతిని గ్రహించి, ఆచరణలో చూపించాలి అని. అంతే కాని మార్కుల కోసం పేజీలకు పేజీలు పరీక్ష రాయమని కాదు. మరి నేను ఆడినమాట నిలబెట్టుకోవాలి కదా! బహుమతిగా నీ విహారయాత్ర ఖర్చులన్నీ నేనే భరిస్తా.. నా మాట కాదనక విహారయాత్రకు రా!'' అన్నాడు. ఇందుకు ముగ్గురు మిత్రులు సంతోషించారు.
Authorization