జింకపిల్ల ఒంటిపై జీబ్రా మాదిరిగా గీతలుంటే అదే జీబ్రా డ్యూకర్. ఇది లైబీరియా, ఐవరీ కోస్ట్, సియెర్రా లియోన్లలోని దట్టమైన అడవుల్లో కనిపించే ఒక జంతువు. దీన్ని బ్యాండెడ్ డ్యూకర్, స్ట్రిప్డ్ బ్యాక్ డ్యూకర్ అని కూడా అంటారు. జీబ్రా డ్యూకర్ల ఒంటిపై పన్నెండు నుంచి పదహారు గీతలుంటాయి. ఇవి శరీరంపై సరిగ్గా సగం వరకే ఎందుకొస్తాయో ఇంతవరకూ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. బరువు కూడా 20 కిలోలు దాటవు. మహా అయితే ఏదైనా ముప్పై కిలోల వరకూ పెరుగుతుందంతే. వీటికి కొమ్ములు ఉంటాయి కానీ అంతగా ఎదగవు. కానీ బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు వాటిని ఉపయోగించి ఇవి తప్పించుకుంటాయి. గింజలు, ఆకులు, పండ్లు తింటాయి. పాపం అంతగా పొడవు ఉండవు కాబట్టి చిన్న చిన్న చెట్లకు ఉండే పండ్లను కూడా ఇవి అందుకోలేవు. చెట్ల నుంచి రాలిపడిన వాటిని ఏరుకుని తింటుంటాయి. ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. వీటి ఎముకలు కూడా మెత్తగా ఉంటాయి. దాతో చిన్న చిన్న దెబ్బలకే ఫెళ్లున విరిగిపోతుంటాయి. కానీ విచిత్రమేమిటంటే వీటి దవడ ఎముకలు మాత్రం మహా గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉండేదాన్నయినా ఫట్మని కొరికేస్తాయి. చిరుతలు, ఆఫ్రికన్ గోల్డ్ క్యాట్స్, పైథాన్స్ వీటికి ప్రధాన శత్రువులు. అలాగే గద్దలు కూడా వీటిని వెంటాడి వేటాడుతుంటాయి. పదకొండు నుంచి పదమూడేళ్లు జీవిస్తాయి. అయితే చర్మం కోసం, మాంసం కోసం ఆఫ్రికన్లు బాగా వేటాడుతుండటం వల్ల అంతకాలం కూడా బతకడం లేదు.
Authorization