హాయ్ నేస్తాలూ...! మీరు నల్లని కోడిని చూశారా? చూశాము అంటారా.. ఆగండాగండి... అయితే ఈరోజు నేను చెప్పబోయే నల్లని కోడి... మీరు చూసిన నళ్లని కోళ్ల కన్నా చాలా ప్రత్యేకం.. ఏంటీ అంటారా? మీరు చూసే కోళ్లకి కండ్లు, చర్మం, గోళ్లు మాత్రం తెల్లగానే కనిపిస్తాయి. లోపలి అవయవాలన్నీ ఎర్రగా ఉంటాయి. కానీ... నలుపంతా నా సొంతమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ అరుదైన ప్రాణి.
-- అయం సెమని... రూపంలోనే కాదు పేరు కూడా వింతగానే ఉంది కదూ.. ఇండోనేషియన్ భాషలో 'అయం' అంటే కోడి, 'సెమని' అంటే పూర్తి నలుపు అని అర్థమట.
- నల్లని కోళ్లకి ఈకలు మాత్రమే నల్లగా ఉంటాయి. కానీ ... వీటి అవయవాలన్నీ నలుపే. అంటే గోళ్లు, కండ్లు, నెత్తిమీది కుచ్చులాంటి తురాయి, ముక్కే కాకుండా... నోరు, నాలుక, చర్మం ఆఖరుకి ఎముకలు, మాంసం కూడా నలుపే. రక్తం పూర్తి నలుపులో కాకుండా నలుపును పోలిన ముదురు ఎరుపు రంగులో ఉంటుది. ఒక్క గుడ్డు మాత్రమే... లేత గోధుమ రంగులో ఉంటుంది.
- 'ఫైబ్రోమెలనోసిన్' అనే ఒక జన్యు లక్షణం వల్ల ఈ కోళ్లు ఇలా ఉంటాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోళ్లు అరుదైనవి. అత్యంత ఖరీదైనవి కూడా. అంతే కాదండోరు... ప్రపంచంలో రుచికరమైన మాంసం ఈ కోళ్లదేనట.
- ఇండోనేషియాకు చెందిన ఈ కోళ్లు జావా, సుమత్రా ద్వీపాల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఐరోపా చేరి ప్రస్తుతం నెదర్లాండ్స్, జర్మనీ, జకోస్లోవేకియా, చెక్‌రిపబ్లిక్, స్వీడన్లో కూడా కనిపిస్తున్నాయి. ఇండోనేషియా ద్వీపాలకు చెందిన ప్రజలు వీటిని అదృష్ట చిహ్నాలుగా భావిస్తూ వేడుకల్లో, పండుగల్లో వీటికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు.
- అయంసెమని కోడి మాంసంలో ఇనుము శాతం ఎక్కువ. అందుకే తరచూ తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. మనదేశంలో మధ్యప్రదేశ్‌లోనూ కొన్ని చోట్ల వీటిని పెంచుతున్నారు.
- మగవి 2 నుంచి 3 కిలోల వరకూ తూగుతాయి. ఆడవి ఒకటిన్నర రెండు కిలోలుంటాయి. విడతకు 20-30 గుడ్లు పెడుతాయి. ఒక్కోకోడి ఏడాదికి 60-80 గుడ్ల వరకూ పెడుతుంది. పచ్చని పొలాల్లో ఎక్కువగా తిరుగాడే ఈ కోళ్లని ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. మిగతా వాటికంటే అయం కోళ్ల మాంసంలో ఔషధ ప్రయోజనాలు ఎక్కువున్నాయని గుర్తించాక రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. అందుకే వీటి ఎగుమతి, దిగుమతులు పెరిగాయి. అన్ని కోళ్ల కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెట్టే కోడిగా దీనికి పేరుంది. అందుకే ఈ కోడి 'పౌల్ట్రీ లంబోర్గిని' అనే బిరుదును కొట్టేసింది.
Authorization