హాయ్ చిన్నారులూ..! మనకు ఆస్ట్రేలియా అనగానే కంగారూలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే అక్కడ ఆ జంతువులే ఎక్కువగా కనిపిస్తాయి. అలానే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల జంతువులు ఎక్కువ సంఖ్యలో ఉండి అందరినీ ఆకర్శిస్తుంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..!
నరా జింకల నగరం
మన వీధుల్లోనైతే అక్కడక్కడా ఆవులు, గేదెలు ఎదురవుతాయి. కానీ ఇక్కడికి వెళితే జింకలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. దక్షిణ టోక్యోకి చెందిన 'నరా' అనే ఊళ్లో దాదాపు 1200 జింకలుంటాయి. వాటన్నిటికోసం 1880లో ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి 1235 ఎకరాల మేర కంచె కట్టారు. అయినా అవి తప్పించుకుని రోడ్ల మీది కి వచ్చేస్తుంటాయి. వాటివల్ల ట్రాఫిక్‌కి అంతరాయం కలిగినా ఎవరూ పట్టించుకోరు. 1637 వరకు వాటిని పట్టినా, చంపినా కఠినశిక్ష విధించేవాళ్లు. తరువాత ప్రభుత్వం జింకల్ని జాతీయ సంపదగా ప్రకటించింది. వీటిని చూడ్డానికి ఎన్నో ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
జావో ఫాక్స్ విలేజ్
ఇది జపాన్‌లో ఉంది. షిరోరుషి పర్వతాల సమీపంలో ఉండే ఈ గ్రామంలో అడుగుపెడితే చాలు వందల సంఖ్యలో నక్కలు ఎదురొస్తాయి. వెళ్లిన వాళ్ల చేతుల్లో తినేందుకు ఏమైనా ఉన్నాయేమోనని వెంటపడుతాయి. ఈ గ్రామం ప్లాటినం నక్క, వెండినక్క, జపనీస్ ఎరుపు నక్క ఇలా 6 జాతుల నక్కలకు నిలయం. ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయే తప్ప ఎవరికీ హాని చేయవు. తినడానికి ఏమైనా వేస్తే చక్కగా తినేస్తాయి. ఇక్కడి దుకాణాలలో దొరికే తినుబండారాలు కొని పర్యాటకులు నక్కలకు వేస్తుంటారు. కాకుంటే పర్యాటక శాఖ కొన్ని హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసింది. ఎందుకంటే..నక్కలు పెంపుడు జంతువుల కాదు. అందువల్ల వాటిని చేతితోనేరుగా ఆహారం అందించడం, పిల్లల్ని వాటి చేరువగా పంపించడం ప్రమాదం. కనుక ఇలాంటి పనులు చేయరాదన్నది వాటి సారాంశం.
కుందేళ్ల దీవి
జపాన్ అంటేనే దీవుల సముదాయం. జపాన్‌లోని హిరోషిమా నగరానికి దగ్గర్లో 'ఒకోనిషిమా' అనే దీవి ఉంది. ఈ దీవిని కుందేళ్ల దీవి(ర్యాబిట్ ఐలాండ్) అంటారు. ఈ దీవిలో కొన్ని వేల కొద్దీ కుందేళ్లున్నాయి. స్థానిక ప్రజలు వీటిని పట్టించుకోలేదుగానీ సందర్శకులతో ఈ కుందేళ్ల దీవి అందరికి తెలిసిపోయింది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడికి వెళ్లే పర్యాటకులు వారి పిల్లుల్ని, కుక్కల్ని తీసుకుపోవడానికి జపాన్ ప్రభుత్వం అనుమతించదు.
మయూర దీవి
ఎక్కడో ఓచోట ఒక్క నెమలి కనబడితేనే మనం ఎగిరిగంతేస్తాం...చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తం. అలాంటిది బెర్లిన్ నగర సమీపంలోని హావెల్ నదీ తీరంలో 188 ఎకరాల్లో ఉన్న పికాక్ ఐలాండ్ నెమళ్లకు ఆలవాలం. ఈ దీవిలో వందలాది నెమళ్లను సంరక్షిస్తున్నారు.. చెట్లపైన, నదీ తీరాన, పూదోటలో ఎటూ చూసిన నెమళ్ల అందాలే. స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఆనందంగా పురివిప్పి నాట్యం చేస్తుంటాయి. అంతేకాదు 100 జాతులకు చెందిన 900 రకాల పక్షులను, జంతువులను ఈ దీవిలో సంరక్షిస్తున్నారు.
హాంన్టాంగ్ కేట్ విలేజ్
ఇది తైవాన్‌లోని తైపీ నగరానికి దగ్గర్లో ఉంటుంది. ఇది పర్వతాలలో ఉండే శిథిలమైన ఒక గనుల నగరం. 1970 వరకూ తైవాన్‌కి అతి ముఖ్యమైన బొగ్గు వెలికితీత ప్రదేశాలలో ఒకటిగా ఉండేది. రాను రానూ గనులు తరిగిపోవడంతో ప్రజలు వలసవెళ్లిపోయారు. 2008లో ఓ ఫోటోగ్రాఫర్ పర్వత ప్రాంతాల పిల్లుల మీద డాక్యుమెంటరీ తీసేందుకు ఇక్కడికొచ్చాడు. ఊహించినదానికంటే ఎక్కువ పిల్లులు ఆ ప్రాంతమంతా తిరుగుతుండటంతో వాటి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. వాటిని చూసిన పిల్లుల ప్రేమికులు ఆ గ్రామానికి రావడం మొదలుపెట్టారు. దాంతో అదో పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది.
Authorization