పాములేవో తలకిందులుగా వేలాడుతున్నట్లుగా కనిపిస్తున్న ఇవన్నీ చెట్లు. మరి వంగిపోయున్నాయేంటీ అంటారా! దీని వెనుక ఎన్నో కథలున్నాయి. దీన్ని క్రూక్డ్ ఫారెస్ట్ అంటారు. అంటే 'వంగిన చెట్లున్న అడవి' అన్నమాట. పోలండ్ దేశంలో గ్రిఫినో అనే పట్టణానికి దగ్గర్లో ఉందిది. ఈ అడవిలో 400 పైన్చెట్లున్నాయి. వీటిని 1930 ప్రాంతంలో నాటారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చెట్లు ఇలా వంగడం వెనక కారణమైతే ఇప్పటికీ తెలీదు. కొందరేమో వీటిని ఫర్నిచర్కు ఉపయోగపడ్తాయని కావాలనే మొక్కలుగా ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటారని అంటున్నారు. మరికొందరేమో మంచు తుఫానుల కారణంగా ఇలా వంగిపోయాయంటున్నారు. ఇంకొందరైతే అవేమీ కాదు! రెండో ప్రపంచ యుద్ధమపుడు యుద్ధ ట్యాంకులు చెట్లకు తగలడం వల్ల చెట్లన్నీ వంపుగా మారాయి అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ అడవిలోని చెట్లు ఇలా వింతగా ఉండటంతో ఇదో పర్యాటక ప్రదేశంగా మారింది..