హయ్! నేస్తాలూ... మీకు తెలుసు కదా... జంతువులు ఒకదాన్ని మించి మరొకటి పరుగులు పెడుతుంటాయి. తమ కన్నా పెద్ద జంతువుల నుంచి ప్రాణాలు రక్షించుకోవాలంటే పరుగెత్తక తప్పదు మరి. అలా జీవితం కోసం పరుగు వాటికి అలవాటైంది. ఎంతవేగంగా పరిగెడితే అంత వేగంగా శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు. లేకుంటే వాటికి బలికావాల్సిందే. అలా కొన్ని జంతువుల పరుగు వేగం ఎంతో తెలుసుకుందామా...
చిరుత పులి
జంతువులన్నింటిలోకెల్లా అత్య ధిక వేగంతో పరుగుతీసేది చిరుతపులి. ఇది గంటకు 100 కి.మీ. వేగంగా పరుగెడుతుంది. కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే అంత వేగాన్ని అందుకుంటుంది. అయితే అదే వేగంతో ఎక్కువ దూరం పరుగెత్తలేవు. అలా చేస్తే దాని ప్రాణలకే ప్రమాదం. ఇది వేటాడటంలో భాగంగా అంత వేగంగా పరిగెత్తి ఆహారాన్ని సంపాదిస్తుంది. ఇది చెట్లను కూడా ఎక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చిరుతపులులు ఉన్నాయి.
దుప్పి
తూర్పు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఉండే దీనిని థామ్సన్ దుప్పి అంటారు. సాధారణంగా దుప్పి అంటే చిరుతపులికి ఇష్టమైన ఆహారం. మరి దాని నుంచి తప్పించుకోవాలంటే పరుగెత్తాలి కదా. అందుకే ఇది గంటకు 80 కి.మీ. వేగంతో పరుగెడుతుంది. ఎంతో వేగంగా పరుగెడుతూ కూడా హైజంప్ చేస్తుంది. ఈ కారణంగానే భూమ్మీద ఇంకా జీవించి ఉన్నాయనిపిస్తుంది.
అడవిదున్న
పశ్చిమ దక్షిణాఫ్రికాలో ఉండే అడవిదున్న (వైల్డ్బీస్ట్) ఇది. సుమారు 500 కలిసి మందగా ఏర్పడి సమూహాలుగా జీవిస్తాయి. ఒంటరిగా జీవించదు. ఇది గాని బెదిరి పరుగుతీస్తే గంటకు 80 కి.మీ. వేగంతో పరిగెడుతుంది. మందలుగా పరుగుతీస్తే విధ్వంసం ఎక్కువగా ఉంటుంది.
నక్క (యురేసియన్ సినెరియోర్ జెంటస్)
దక్షిణ అమెరికాలో ఉండే ఇది వాటి జాతిలోనే అతి చురుకైన జిత్తులమారి నక్క. ఇది బూడిదరంగులో ఉంటుంది. ఎలుకలు, కుందేళ్లు, పక్షులను వేటాడుతుంది. ఇది గాని పరుగుపందెంలో పాల్గొంటే గంటకు 64 కి.మీ. వేగంతో పరుగెడుతుంది. ఇవి వేటలో భాగంగా చెట్లను కూడా ఎక్కుతాయి. అందుకనే ఇది వుడ్ఫాక్స్ అనే పేరు కూడా సంపాదించింది.
కుందేలు
యూరోపియన్ జాతి కుందేళ్లు చాలా దేశాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, పశ్చిమ యూరప్, తూర్పు మధ్య ఆసియాలో ఉండే ఈ రకం కుందేలు ప్రదేశాన్ని బట్టి దీని పరుగు మారుతుంది. ఈ కుందేలు తికమకగా పరుగుతీస్తుంది. అయినా ఇది గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో పరుగెడుతుంది.
తోడేలు
ఉత్తర అమెరికా మధ్యప్రాంతంలో నివసించే ఈ తోడేలు బాగా పరిగెత్తడమే కాదు... నీటిలో బాగా ఈదుతాయి కూడా. ఆహారం కోసం చేపలను కూడా వేటాడుతాయి. ఇది గాని పరుగుపందెంలో పాల్గొంటే గంటకు 65 కి.మీ. వేగంతో పరుగెడుతుంది.
పందికొక్కు
ఆస్ట్రేలియా జాతికి చెందిన ఈ పందికొక్కు ఆవాసం కోసం భూమిలో సొరంగాలను తవ్వుకొని అందులో నివసిస్తుంది. ఇదిగాని పరుగుపందెంలో పాల్గొంటే గంటకు 62 కి.మీ వేగంతో పరుగెడుతుంది. ఇవి చెట్లను కూడా ఎక్కగలవు. నీటిలోనూ ఈదగలవు.
పులి
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పులులు ఉన్నాయి. అయినా వీటన్నింటి కంటే వేగంలో మాత్రం దక్షిణ చైనా పులి ముందుంటుంది. ఇది రెండు నుంచి రెండున్నర మీటర్ల పొడవుండి, బరువు మాత్రం 100 కిలోలకు పైగానే ఉంటుంది. ఈ పులి సుమారుగా గంటకు 56 కి.మీ. వేగంతో పరిగెడుతుంది.