హాయ్ ఫ్రెండ్స్..! కెనడాలో స్పాటెడ్ లేక్ అనే ఒక సరస్సు ఉంటుంది. అయితే ఏంటీ అంటారా? ఆగండాగండి చెబుతాను.. అది మామూలు సరస్సు కాదు. ఇంద్రధనస్సులోని రంగులన్నిటినీ కలబోసుకుని ఉంటుంది. ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంటుంది. అందుకనే ఆ సరస్సును చూసేందుకు బోలెడు మంది పర్యాటకులు క్యూ కడుతుంటారు.. మరి మనం కూడా ఆ సరస్సు విశేషాలు తెలుసుకుందామా..
- ప్రపంచంలోని ప్రకృతి వింతల్లో ఇదొకటి. దీనిపేరు క్లిలుక్లేక్. స్పాటెడ్లేక్ అనీ అంటారు. ఇది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో ఒకానగన్ రహదారికి 3 కిలోమీటర్ల దూరంలోని ఒసొయోస్ లోయలో ఉంది. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించింది.
- ఈ సరస్సు చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తుంది. అంతలోనే రంగులు మార్చేస్తుంది. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ రంగుల్లో ఆకట్టుకుంటుంది. వేసవి వస్తే మాత్రం మచ్చలున్న రహదారిలా మారిపోతుంది.
- సరస్సు ఇలా రంగులు మారుతుండటంపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. భూమ్మీద ఉండే అధిక ఖనిజ సంపద కలిగిన సరస్సుల్లో ఇదొకటి. ఈ నీళ్లల్లో రకరకాల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం, సోడియం సల్ఫేట్ అత్యధిక శాతంలో పేరుకున్నాయి. ఇంకా ఏడెనిమిది రకాల ఇతర ఖనిజాలు, తక్కువ మొత్తంలో వెండి, టైటానియం వంటివి కూడా కలిసుంటాయి. ఖనిజాల హెచ్చు తగ్గులు, మిశ్రమం కారణంగా ఈ నీటి రంగులో మారిపోతుంటాయి.
- ఇక్కడ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకి సరస్సులో నీరంతా ఇంకిపోతుంది. దాంతో ఖనిజాలు గడ్డకట్టి, గట్టి స్పటికాల్లా తయారవుతాయి. అక్కడంతా రంగురంగుల మచ్చల్లా ఏర్పడుతాయి. అందుకే దీన్ని మచ్చల సరస్సంటారు. వేసవిలో దానిమీద నడిచినా ఏమీ కాదు. రోడ్డు మీద నడిచినట్టే అనిపిస్తుంది.
- అంతేకాదు అక్కడివాళ్లు దీన్నో పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. ఈ నీటితో అంటురోగాలు, చర్మవ్యాధులు వంటి అనారోగ్యాలు తగ్గుతాయట. నలతగా ఉంటే ఇక్కడికి వచ్చి పీకల్లోతు నీళ్లలో మునుగుతారు. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉంటాయని వాళ్ల నమ్మకం. ఇదంతా ఆ నీటిలో ఉండే ఖనిజాలవల్లేనని పరిశోధకులు చెబుతున్నారు. పూర్వకాలం యుద్ధంలో గాయపడిన వాళ్లకి ఈ నీటితోనే మర్దనా చేసి నయం చేసేవాళ్లట.
- మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడి జలాలను, మట్టిని అధికంగా తరలించేవారట. వాటిని తూర్పు కెనడాలోని యద్ధ సామాగ్రి తయారు చేసే పరిశ్రమలకు చేర్చేవారు. వాటిని మందుగుండు తయారు చేసేందుకు ఉపయోగించేవాళ్లు. ఇప్పుడైతే ఖనిజ నిక్షేపాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ సరస్సు చుట్టూ కంచె ఏర్పాటు చేసింది.
- ప్రపంచంలోని అన్ని దేశాల నుంచీ ఈ రంగుల సరస్సును చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఎక్కువగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పెద్ద సంఖ్యలో వస్తారు. రంగు రంగుల మచ్చల సరస్సు అందాలను చూడాలంటే అదే సరైన సమయం.
Authorization