చూడ్డానికి వేలెడంతే ఉంటాయి. కానీ ఈ జంతువులకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిని చూడాలంటే జనాలు క్యూలో ఉండాల్సిందే.... ఇక కొనాలంటే మాత్రం లక్షలు వెచ్చించాల్సిందే.. మరి వీటి విశేషాలేంటో తెలుసుకుందామా పిల్లలూ!
వీటి పేరు 'పిగ్మీ మార్మోసెట్'. వీటిని అందరూ ఫింగర్ మంకీస్, పాకెట్ మంకీస్ అంటారు. చెప్పాలంటే ఇవీ కోతులే. కాకుంటే ప్రపంచంలోనే అతి చిన్న కోతులు. ఈ భూమ్మీద మొత్తం 264 వానర జాతులుంటే అందులోని 'కేలిట్రిచిడే' కుటుంబం వీటిది. ఇవి ఉండేది దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, పెరు, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియాల్లోని వర్షారణ్యాలలో. వీటిలో అతిపెద్దదాని పొడవే 5 అంగుళాలకి మించదు. తోకతో కలుపుకుంటే 14 అంగుళాలే. శరీరం కన్నా తోకే పొడవుంటుంది. పొట్టివే అయినా మహాగట్టివి ఇవి. అవసరమనుకుంటే మామూలు కోతుల్లానే 16 అడుగుల వరకూ సునాయాసంగా దూకేస్తాయి. వీటి బరువు మహా అయితే వంద గ్రాములే. వీటి కళ్లు బాదం గింజల ఆకారంలో ఉండి చూపు తీక్షణంగా ఉంటుంది. అంతే కాదు.. 180 డిగ్రీల వరకు మెడను తిప్పి చూడగలుగుతాయి.
వీటికి పదునైన పళ్లుంటాయి. వాటితో తుమ్మ చెట్ల బెర డుకి లోతుగా రంధ్రం చేస్తాయి. అందులోంచి చిక్కగా జిగురులాంటి పదార్థం కారుతుంది. అదే వీటికి ఇష్టమైన ఆహారం. ఇంకా... ఆకులు, పూలు, పండ్లు, కీటకాలు, సాలెపురుగులు, చిన్న చిన్న బల్లులు, తేనె కూడా తింటాయి.
వీటిలో బాగా పెరిగినవి సాధారణంగా నలుపు, ఊదారంగుల్లో ఉంటాయి. కింది భాగం తెల్లగా ఉండి బంగారు రంగు కుచ్చులాంటి జుట్టు శరీరమంతా ఉంటుంది. ఇవి ఎక్కడికి వెళ్లినా సమూహంగానే వెళ్తాయి. ఒంటరిగా ఉండేందుకు అస్సలిష్టపడవు. పుట్టిన 5 నెలల నుంచే పిల్లల్ని కనేయడానికి సిద్ధపడుతాయి. 135 రోజుల గర్భధారణ తరువాత ఒకటి నుంచి 4 వరకు పిల్లల్ని కంటాయి. ఇవి మనుషుల్లాగే ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని పిల్లలతో కలిసుంటాయి. వీటి సగటు జీవిత కాలం 25 సంవత్సరాలుంటుంది. చాలా వరకూ 11 నుంచి 15 ఏండ్లే ఉంటాయి. ఎందుకంటే వీటికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. పిల్లులు, పాములు, రాబందుల్లాంటివి దాడిచేసి ఎత్తుకుపోతుంటాయి.
వీటి తీరే కాదు భాష కూడా వేరే. వీటి గొంతు సన్నగా ఉన్నా గట్టిగానే ఉంటుంది. అది ఈలవేసినట్టే వినిపిస్తుంది. ఇవి కుదురుగా అస్సలు ఉండవు.ఒక చెట్టు నుంచి మరోచెట్టు మీదకి గెంతుతూనే ఉంటాయి.
ఆకారంలో చిన్నగా ఉన్నా వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఎంతుంటుందేంటీ? అనుకుంటున్నారా? అక్షరాలా లక్షా యాభై వేల నుంచి దాదాపు ఐదు లక్షల వరకు పెట్టాల్సివస్తుంది. అంతేకాదు.. ఆ తరువాత ఖర్చులు కూడా ఎక్కువే. వీటి సంరక్షణ తలకు మించిన భారం. చీటికిమాటికి వైద్యుని సలహాలు తీసుకోవాలి. కోపం వస్తే గట్టిగా కరుస్తుంటాయి కూడా. అయితే వీటికాటు వల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు.
Authorization