ఫ్రెండ్స్! మీకు తెలుసు కదా... గ్రహాలన్నిట్లో మన భూగ్రహంపైనే నీరు ద్రవరూపంలో కనిపిస్తుంది. కాబట్టే, కోట్లకొద్దీ జీవరాశి ఈ గ్రహంపై హాయిగా బతికేస్తోంది. అంతేకాదు మరెన్నో ప్రత్యేకతలున్నాయి ఈ అవనికి.. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...
- నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్.,.. ఈ గ్రహాల పేర్లన్నీ గ్రీకు, రోమన్లు వారు పూజించే దేవుళ్ల పేర్లు పెట్టారు. కానీ భూగ్రహానికి మాత్రం 'ఎర్త్' అని కొత్త పేరు పెట్టారు మన పూర్వీకులు. ఇందుకు అసలు కారణం ఇంతవరకూ ఎవరూ చెప్పలేకపోయారు. అయితే మట్టిని, నేలను అప్పట్లో 'ఎర్త్' అనేవాళ్లు. దాంతో, ఆ పేరే భూగ్రహానికీ పెట్టి ఉంటారని కొందరంటారు,
- భూమికీ జీవం ఉంది. జీవరాశి బతికేందుకు అవసరమైన వనరులను, వాతావరణాన్ని భూమి నిరంతరంగా సృష్టిస్తూ ఉంటుంది. అలాగే, రకరకాల భౌగోళిక మార్పులకు లోనవుతూ జీవుల మనుగడకు ఉపయోగపడుతోంది. ఈ లక్షణాల ఆధారంగా భూమికీ జీవం ఉందని అనుకోవచ్చు.
- భూమి అగ్నిపర్వతాలమయం. ఈ గ్రహం మీద మొత్తం 1500 పైగా అగ్ని పర్వతాలున్నాయి. ఇవి వెదజల్లే లావా చల్లారి బూడిదగా మారి మట్టిలో కలుస్తూఉంటుంది. భూమిపైన అడుగున ఉండే 80% మట్టి ఇలా ఏర్పడినదే.
- భూమి కవల గ్రహం. 4.5 వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం భూమిలాంటి గ్రహమే మరొకటి ఉండేది. దాని పేరు 'థియా'. ఇది కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ గతి తప్పి భూమిని ఢకొీట్టింది. దాంతో, ఈ రెండు గ్రహాలూ కలిసి ఒకే గ్రహంగా ఏర్పడ్డాయి. తర్వాత భూమి ఆ గ్రహాన్ని తనలోనుంచి బయటకు నెట్టేయడంతో అది భూమి నుంచి విడిపోయి చంద్రుడిగా ఏర్పడిందని అంటారు.
- అయితే భూమిని అంతరిక్షం నుంచి చూసినపుడు ఓ పెద్ద గాటు కనిపిస్తుంది. అది దక్షిణ అమెరికాలోని 'యాండీస్' పర్వత శ్రేణులు. వీటి పొడవు 6 వేల 920 కిలోమీటర్లు. ఇవి అర్జెంటీనా, పెరూ, చిలీ, బొలీవియా, కొలంబియా, వెనిజులా, ఈక్విడార్ అనే 7 దేశాలకు విస్తరించి ఉంటాయి.
- భూమికి కావలసిన ఉష్ణ శక్తి సూర్యుడి నుంచి అందుతుంది. కాబట్టి, సూర్యుడు లేకపోతే భూమి అంతరించిపోతుందని అనుకుంటాం. నిజానికి భూమి మధ్య భాగం 'కోర్'లో కూడా ఎంతో ఉష్ణశక్తి ఉంది. దీని వేడి సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రతకు సమానంగా 5వేల డిగ్రీల సెల్సియస్ పైనే ఉంటుంది. ఒక సంవత్సరంలో భూమి 10 లక్షల భూకంపాలకు గురవుతుంది. కానీ వీటిలో ఎక్కువ శాతం భూకంప లేఖినులు గుర్తించలేనంత చిన్నవిగా ఉంటాయి.
Authorization