పిల్లలూ! సూక్ష్మ జీవులు అనగానే మనం అదిరిపడతాం! అన్ని రోగాలకూ అవే కారణం కాబట్టి వాటికి భయపడతాం! కానీ, వాటిల్లోనూ మనకు మేలు చేసేవీ, ఉపయోగపడేవీఉన్నాయి.మరి వాటి గురించి తెలుసుకుందామా!
భూమి మీద ప్రాణం పోసుకున్న పురాతన జీవులు సూక్ష్మజీవులే! ఇవి 3 వందల కోట్ల 80 లక్షల సంవత్సరాల ముందు నుంచే భూమిపై బతికేస్తున్నాయి. ఎడారి, మంచుచ నీళ్లు, మట్టి, గాలి, శరీరంలోపలి భాగాలు.. ఇవన్నీ సూక్ష్మజీవుల నివాసాలే! ఒక గ్రాము మట్టిలో 10 కోట్ల సూక్ష్మజీవులుంటాయి.
మీరు నమ్ముతారా? మన తలమీదున్న చర్మం మృత కణాల్లో 50 కోట్ల సూక్ష్మజీవులుంటాయి.
డచ్ శాస్త్రవేత్త 'ఆంటోనివాన్లీవెన్హాక్' సూక్ష్మజీవుల్ని చూడగలిగే 'సూక్ష్మదర్శిని' కనుగొన్నారు.అప్పటి నుంచి పరిశోధనలు మరింత వేగవంతమయ్యాయి.
ఫ్రాన్స్ శాస్త్రవేత్త 'లూయి పాశ్చర్'.. వ్యాధులకు, పదార్థాలు పాడవ్వటానికి, పులిసిపోవడానికి, శిథిలమవ్వడానికి సూక్ష్మజీవులే కారణమని కనిపెట్టారు.
ఇంగ్లండ్ డాక్టర్ 'జోసెఫ్ లిస్టర్' సూక్ష్మజీవుల సంహారిణిగా 'కార్బోలిక్ యాసిడ్' ఉపయోగపడుతుందని కనిపెట్టారు.
ఉపయోగాలు:
'ఫ్లాక్స్' మొక్కల్ని నీళ్లలో నానబెట్టినప్పుడు కాండాలపై బ్యాక్టీరియా దాడి చేస్తుంది. కణజాలాన్ని పొట్టనిండా లాగించేసి నారను వదిలేస్తుంది. ఈ నారతో 'లినెన్' దారాలు చేస్తారు. వీటితో వస్త్రాలు తయారవుతాయి.
జంతు చర్మాలను ఎక్కువ కాలం మన్నేలా 'టానింగ్' చేస్తారు. అంటే వాటిని రసాయనాలతో శుభ్రం చేసి ఆరబెడతారు. ఇలా చేస్తున్నప్పుడు, బ్యాక్టీరియా ఆ చర్మాల్లోని మాంసాన్ని నాశనం చేసి వాటిని మెత్తబడేలా చేస్తుంది.
'అసిటో బ్యాక్టర్' బ్యార్టీరియా వల్లే.. జున్ను, వెనిగర్, పెరుగు తయారవుతున్నాయి.
'స్ట్రెప్టోమైసిస్' అనే యాంటీ బయాటిక్ మందుల తయారీలో బ్యాక్టీరియా ఉపయోగిస్తారు.
సిల్మద్రలు (ఆల్గే)
జపాన్, చైనాల్లో సిల్మద్రలైన సముద్రపు నాచును ఆహారంగా తింటారు.
ఐస్క్రీమ్, జెలటిన్ తయారీల్లో ఎరుపు సిల్మద్రను ఉపయోగిస్తారు.
సిల్మద్రల కణ సారాన్ని మందులు, సౌందర్య ఉత్పత్తులు, రంగుల తయారీలో ఉపయోగిస్తారు.
క్లోరెల్లా అనే ఏక కణ ఆకుపచ్చ సిల్మద్రలను అంతరిక్ష యాత్రికులు ఆహారంగా తింటారు.
శిలీంద్రాలు (ఫంగస్)
పుట్టకొక్కులు... బహుకణ సూక్ష్మజీవి 'ఫంగస్' నిర్మాణాలే ఇవి! వీటిలో బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి కాబట్టే వండుకుని తింటున్నాం. వీటిలో విషపూరితమైనవీ ఉంటాయి.
కేకులు, బ్రెడ్ల తయారీలో కలిపే 'ఈస్ట్' కూడా శిలీంద్రమే! ఇది కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసి పిండిని పొంగిస్తుంది. పెన్సిలియమ్ నొటాటమ్ అనే బూజు నుంచే 'పెన్సిలిన్' మందు తయారయింది.
Authorization