పిల్లలూ! లోహాలు అంటే మనం గట్టిగానే ఉంటాయనుకుంటాం. కానీ మెత్తనివి కూడా ఉంటాయని మీకు తెలుసా? అందులో ఒకటి సోడియం లోహం. దీన్ని మనం తినే పదార్థంగానే కాకుండా మరెన్నో విధాలుగాకూడా ఉపయోగిస్తాం. మరి అవన్నీ తెలుసుకుందామా...!
- సోడియం చూడ్డానికి తెల్లగా ఉంటుంది. ఇది చాలా మెత్తని క్షారలోహం. ఎంత మెత్తనిదంటే రూపాయి బిళ్లతో కూడా ఈ లోహాన్ని కొయ్యొచ్చు. సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్ వంటి సోడియమ్ సమ్మేళనాలన్నీ చాలా వరకు నీటిలోనే కరుగుతాయి. కానీ సోడియం మాత్రం నీటిమీద తేలుతుంది. లోహాలన్నింటిలో నీటిమీద తేలేవి మూడే మూడు. అందులో లిథియం, పొటాషియం, ఇంకా మనం చెప్పుకుంటున్న సోడియం.
- భూమిలోపల పుష్కలంగా లభించే మూలకాల్లో సోడియంది ఆరోస్థానం. అలాగని అంత తేలిగ్గా తీసుకోవడానికి కుదరదు. భూమిలోపలున్న ఫెల్డ్స్పర్, సోడాలైట్, రాక్‌సాల్ట్ వంటి సమ్మేళనాలనుంచి వేరుచేసి మరీ సోడియంను తయారుచేస్తారు. సోడియంను మండించినపుడు పసుపురంగు కాంతి వస్తుంది. అలా వస్తే అది సోడియమే అని నిర్ధారిస్తారన్నమాట.
- ఈ లోహాన్ని సర్ హంప్రీడేవి అనే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈయన 1807లో సోడియం హైడ్రాక్సైడ్‌ను విద్యుత్ విశ్లేషణ చేసి సోడియంను వెలికితీశారు. సోడియంకు నీటిని కలిపినపుడు అందులో హైడ్రోజన్ విడుదల అవుతుందని ఆయన కనుక్కున్నారు. అందుకే ఈ లోహానికి 'సోడజెన్' అనే పేరు పెట్టాలని తన పుస్తకంలో రాసుకున్నారట హంప్రీ. దాన్నే ఇప్పుడు సోడియంగా పిలుస్తున్నారు.
- సోడియం మామూలుగా అయితే తెలుపు అనుకున్నాం కదా! అయితే దీనికి గాలి తగిలితే మాత్రం ఆక్సిజన్‌తో కలిసిపోతుంది. దాంతో సోడియం ఆక్సైడ్‌గా మారి బూడిద రంగు, తెలుపు కలిసిన రంగులో కనపడుతుంది. మరి ఇలా నల్లగా మారకుండా సోడియంను ఎలా దాస్తారబ్బా! అనుకుంటున్నారా! అందుకే దీన్ని కిరోసిన్ వంటి చమురుల్లో ఉంచుతారు. అప్పుడు ఆక్సీకరణం అవ్వకుండా నికార్సైన సోడియం మనకు లభిస్తుంది.
- సముద్రాల్లోని సోడియంతో భూమి అంతటికీ 500 అడుగుల మందమైన పొర వేసెయ్యొచ్చు.
ఉపయోగాలు
- కూరల్లో వేసే ఉప్పు (టేబుల్ సాల్ట్/ సోడియం క్లోరైడ్)లో వంటసోడాలోనూ సోడియం ఉంటుంది.
- సోడియంను గాజు, కాగితం, వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా వాడుతారు.
- న్యూక్లియర్ రియాక్టర్లను చల్లబరచడానికి సోడియంను వాడతారు. దీనికి ఉష్ణాన్ని బయటకు పంపే శక్తి ఉంది.
- సోడియం లోహం సోడమైడ్ తయారీలోనూ, సేంద్రీయ సమ్మేళనాల తయారీలోనూ ఉపయోగపడుతుంది.
- సోడియం లాంప్లు ఎక్కువ కాంతిని విడుదల చేస్తాయి. ఇప్పటికీ చాలా నగరాల్లో వీటినే వాడుతున్నారు.
సాధారణంగా ఏ మూలకమైనా ఉపయోగాలతోపాటుగా, ఎంతోకొంత విషస్వభావాన్ని కలిగిఉంటుంది. కానీ సోడియం విషపూరితం కాదని పరిశోధకులు తేల్చారు. ఈ లోహం చర్మానికి అంటితే మాత్రం మంటపుట్టి, కాలిన గాయాల్లాగా మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు.
Authorization