గూగుల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రచారం పొందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇది అతిపెద్ద సెర్చి ఇంజిన్. అంటే మనకు కావలసిన దానిని అందులో టైప్ చేసి, సెర్చ్ అని కొడితే పుటలకొద్దీ సమాచారం లభిస్తుంది. ఇక గూగుల్ మ్యాప్స్ అనేది వెబ్ మ్యాపింగ్ సర్వీస్. ఇది భూమి గగనతల దృశ్యం, రోడ్ల చిత్రాలు, కాలిబాట, కారు, బైకు, ప్రజారవాణా మార్గాల వివరాలు తెలియజేస్తుంది. అలాగే నగరాల్లో పెద్ద కంపెనీల స్థానాలు, ఇంటి చిరునామాలు కూడా చూపిస్తుంది. వివిధ ప్రదేశాల నుంచి రోడ్డు మార్గంలో 360 డిగ్రీల విశాలమైన దృశ్యాలను దీనిద్వారా మనం చూడవచ్చు. మనకు తెలియని ఎన్నో చిరునామాలను తెలుసుకోవచ్చు. ఇవి కేవలం భూగోళాన్నే కాదు, చంద్రుడిని, అంగారకుణ్ణి సైతం పరిశోధిస్తోంది. గూగుల్ మ్యాప్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలతోబాటు రక్షణ, భద్రతకు సంబంధించిన నష్టాలు కూడా లేకపోలేదు.