హలో నేస్తాలూ! 'నల్ల కుక్కకు నాలుగు చెవులు' ఎవరు? అని పొడుపు కథ ఉంటుంది? అదెవరో తెలుసా! లవంగమే. ఇది ప్రతివారి వంటింట్లో ఉండే మసాలా దినుసు. ఘాటైన వాసనతో ఉండి వంటలకు రుచినిస్తుంది.
తిలవంగాల శాస్త్రీయ నామం 'షైజీజియమ్ ఆరోనాటికమ్'. ఇది మిర్టేసి కుటుంబం, 'మిర్టేల్స్' క్రమానికి చెందినటువంటిది. నల్లగా, చిన్నకాడలాగా ఉంటుంది. ఆ కాడ మీద గుండ్రని చిన్న బంతిలాంటి నిర్మాణం ఉంటుంది. పొడవైన కాడను కాలిక్స్ అంటారు. నాలుగు చిన్నచిన్న సెపల్స్, విప్పబడని నాలుగు పెటల్స్ ఉంటాయి. లవంగాలు పూమొగ్గలు.
- లవంగం చెట్టు 8 నుంచి 12 మీటర్ల పొడవు పెరుగుతుంది. ఇది సంవత్సరం పొడుగునా పచ్చగానే ఉంటుంది. పొడవైన పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. పువ్వులు క్రిమ్సన్ కలర్లో ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఒకే పుష్పగుచ్ఛంగా ఉంటాయి. పూమొగ్గలు మొదట లేత తెలుపురంగులో ఉండి క్రమక్రమంగా ముదురు ఎరుపురంగుకు మారి కోతకు సిద్ధమవుతాయి. పూమొగ్గలోని కాలిక్స్ 1.5 సెం.మీ. నుండి 2 సెం.మీ. పొడవుతో ఉంటుంది. వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో సాగుచేయడం మూలంగా సంవత్సరమంతా అందుబాటులో ఉంటాయి.
- లవంగాల పుట్టినిల్లు ఇండోనేషియా దీవుల్లోని 'మాలుకు దీవులు'. క్రీ.పూ. 3వ శతాబ్దంలో చైనీస్ రాజవంశంలోని హాన్ రాజవంశం వారు వీటిని వాడినట్లుగా తెలుస్తున్నది. లవంగాలను నమలడం వలన సువాసన వస్తుందని తెలుసుకున్నారు. అందువలననే 'హాన్' రాజవంశం వారు వీటిని నోటి శుభ్రత కోసం వాడేవారట.
- లవంగాలలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మధ్యయుగాల్లో హిందూ మహాసముద్రం ద్వారా లవంగాల వ్యాపారం సాగుతుండేది. ఈ వ్యాపారాన్ని నావికులు, వ్యాపారులు సాగించేవారు.
- లవంగాలు మొలుక్కాస్ దీవుల వంటి కొన్ని దీవుల్లో మాత్రమే లభించేవి మొదట్లో. క్రమక్రమంగా ప్రపంచమంతా పండించటం మొదలుపెట్టారు. బేకన్, మేకియాన్, మోతి, టెర్నేట్, టైడోర్ వంటి దీవులన్నింటిని మొలుక్కాస్ దీవులని పిలిచేవారు. వీటిని చరిత్రలో మసాలా దీవులని పిలిచేవాళ్లు. - టెర్నెట్ దీవుల్లోని ఒక లవంగ చెట్టు చాలా పురాతనమైనదని చరిత్రకారుల అభిప్రాయం. ఆ చెట్టు వయసు సుమారుగా 350 నుంచి 400 సంవత్సరాల దాకా ఉండవచ్చని అంచనా. ఈ చెట్టు పేరు 'అఫా'. ఈ చెట్టు మొలకలను దొంగిలించిన ఫ్రెంచివాళ్లు మారిషస్‌కు తీసుకువెళ్లారు. ఆ తరువాత జింజిబర్కు చేరింది. ప్రస్తుతం జింజిబర్ ప్రపంచవ్యాప్తంగా లవంగాలను అత్యధికంగా పండించేదిగా పెంపొందింది.
- లవంగాల నుండి ఘాటైన వాసనగల నూనెను తీస్తారు. ఈ లవంగ నూనెలో యూజినాల్ ఉంటుంది. లవంగాలను నీటితో కలిపి 125 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పీడనం కలిపించినపుడు నూనె బయటకు వస్తుంది. ఇలా నీటి పీడనం ద్వారానే కాకుండా మైక్రోవేవ్ పద్ధతి ద్వారానూ, అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారానూ కూడా లవంగ నూనెను తీస్తారు. లవంగనూనెలో బైకార్సిన్, గాలోటానిక్ యాసిడ్, మిథైల్ శాలిసిలేట్ వంటి టానిన్స్ ఉంటాయి.
- లవంగాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. దగ్గు ఎక్కువగా వదిలిపెట్టకుండా వస్తున్నపుడు లవంగం బుగ్గన పెట్టుకుంటారు మన పెద్దలు. భారతీయ ఆయుర్వేద వైద్యంలోనూ, చైనా వైద్యంలోనూ లవంగాలకు ప్రధానపాత్ర ఉన్నది. దంత సమస్యల నివారణలో లవంగం చక్కగా పనిచేస్తున్నదనే టూత్‌పేస్టులలో లవంగాలను ప్రవేశపెడుతున్నారు.
Authorization