పిల్లలూ..! ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి. ఒక్కో జంతువుది ఒక్కోప్రత్యేకత. అలాగే కొన్నిసార్లు కొన్ని జీవులపై ఉండే మచ్చలూ వాటికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. వాటిని అరుదైన వాటిల్లో చేరుస్తాయి. అలాంటివే కొన్ని ఇవి...
బ్లీడింగ్ హార్ట్స్
లుజోన్ బ్లీడింగ్ హార్ట్. వీటిని చూస్తే పావురం లాగే ఉంటాయి. కానీ వాటిల్లో ఇది అరుదైన జాతి. వీటి బ్లీడింగ్ హార్ట్స్ అని కూడా పిలిచేస్తారు. ఎందుకనో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీటి శరీరానికి ఏ తూటానో తగిలి ఎర్రగా రక్తం కారుతున్నట్టు కనిపిస్తోంది కదూ.. ఆ పోలికవల్లే వీటికా పేరు పేరు వచ్చింది. బూడిద రంగులోని వీటి శరీరంపై ఎర్రగా కనిపించే ఆ మచ్చవల్ల అందరూ వీటిని చూసి పొరబడతారు. కానీ వీటి రూపమే అంత అని తెలియదు మరి. ఇవిఎక్కువగా ఫిలిప్పీన్స్లోని లుజోన్లో ఉంటాయి. చిన్న చిన్న గింజలు తింటూ బతికేస్తాయి. ఎక్కువగా నేలపైనే గడుపుతుంటాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వీటి జాతి ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది.
బబూన్
వీటిని చూసి భయపడిపోకండే. వీటి ఆకారం చూడ్డానికి బెదరగొట్టేలా ఉంటుంది. వీటి పేరు జెలడా. జెలడా బబూన్ కూడా అంటారు. ఇంకా బ్లీడింగ్ హార్ట్ మంకీ అనే పేరూ ఉంది. వీటి గుండె దగ్గర ఛాతిభాగంలో ఉన్న ఎర్రటి మచ్చవల్లే వీటికాపేరు వచ్చింది. గోధుమరంగు శరీరంపై గులాబి ఎరుపు రంగులో మెరిసే ఆ మచ్చతో జతను ఆకట్టుకుంటాయి. ఎక్కువగా ఇథియోపియాలో కనిపిస్తుంటాయి. వీటి ఆహారం ఆకులూ, ఆలములే. అవును.. ఎక్కువగా గింజలు, మొక్కలు, పండ్లు తినేస్తాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కీటకాల్ని కూడా తింటాయి. కొండ ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడుతాయి. వీటిలో అప్పుడే పుట్టిన కోతి పిల్లలకు కండ్లు కనిపించవు. మగ కోతులు ఆడ కోతుల కన్నా పెద్దగా ఉంటాయి.
బ్లీడింగ్ హార్ట్ టెట్రా
మీరు ఇప్పటివరకు బోలెడు చేపలు చూసి ఉంటారు. ధగధగ మెరిసేవి, రంగులతో కనువిందు చేసేవి. మరి వీటి ప్రత్యేకత ఏంటో చెప్పనా? వీటి శరీరంపై కనిపిస్తున్న ఈ రక్తపు మచ్చే. గుండె నుంచి రక్తం కారుతున్నట్టు అనిపించే వీటిరూపంపై ఉన్న మరక వల్లే వీటికి బ్లీడింగ్ హార్ట్ టెట్రా అని పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాస్త భిన్నంగా ఉన్న వీటి ఆకారం వల్ల వీటిని ఎక్కువగా అక్వేరియాల్లో పెంచుకుంటారు. చిన్న రొయ్యల్ని, బుల్లి బుల్లి జీవుల్ని పట్టుకుని ఆంఫట్మనిపిస్తాయి.
Authorization