పిల్లలూ! మీకు లైబ్రరీ అంటే తెలుసు కదా! అక్కడ బోలెడన్ని పుస్తకాలుంటాయి. అంతేనా ప్రశాంతంగా ఉండే గదిలో చుట్టూ అల్మరాలు, మధ్యలో నాలుగు బల్లలు.. వాటికి అటూ ఇటూ కుర్చీలు ఉండి అందరూ చదువుకునేందుకు అనువుగా ఉంటుంది. మనకైతే గ్రంథాలయం అంటే ఇలాగే ఉంటుందని తెలుసు... అయితే విదేశాల్లో మాత్రం కొందరు వినూత్నంగా ఆలోచించారు. గ్రంథాలయాలను సరికొత్తగా ఆవిష్కరించారు.
బీచ్‌లో గ్రంథాలయం
ఎప్పుడైనా సముద్రతీరంలో ఆడుకున్నారా? అలా ఆడుకుంటున్నప్పుడు పక్కనే పుస్తకాలు చదివేసి, తర్వాత మళ్లీ ఆడుకోవడానికి వెళ్లిపోవచ్చు. ఆస్ట్రేలియా పెద్దమనుషులు కూడా ఇదే ఆలోచనతో 'బొండీ' బీచ్‌లో ఇలా వేల పుస్తకాలను నిలబెట్టేశారు. ఈతకొట్టడానికి వచ్చే వాళ్లు, సర్ఫింగ్ చేసేవాళ్లు, పర్యాటకులందరూ కాసేపు నీళ్లలో ఆడుకుని తరువాత కాసేపు పుస్తకాలు తిరగేస్తున్నారు.
వెన్నెస్లా గ్రంథాలయం
అబ్బ! ఎంత అందంగా ఉంది. గ్రంథాలయాలు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా! అదే మరి వెన్నెస్లా గ్రంథాలయం ప్రత్యేకత. నార్వేలోని వెన్నెస్లా పట్టణంలో ఉన్న ఈ గ్రంథాలయాన్ని 2011లో నిర్మించారు. దీని నిర్మాణంలో ఎక్కువగా కలపనే వాడారు.
మర్రిచెట్టు గ్రంథాలయం
జర్మనీ రాజధాని బెర్లిన్ వెళ్తే పుస్తకాలను దాచుకున్నట్లు చెట్లు కనిపిస్తాయి. అశ్చర్యపడకండి... పడిపోయిన చెట్లకాండాలను తొలచి చక్కగా పుస్తకాల అరల్లా మార్చేశారు. ఒక్కోచెట్టు కాండంలో వంద పుస్తకాల వరకూ పెట్టి బెర్లిన్ రహదారుల మీద నిలబెట్టారు. వచ్చిపోయే వాళ్లందరూ ఆగి మరీ చదువుకుంటున్నారు.
పార్కులో గ్రంథాలయం
కొలంబియాలో ఇలా పార్కుల్లో చిన్నచిన్న గ్రంథాలయాలు పెట్టారు. ప్రస్తుతం అలాంటివి అక్కడ వంద వరకూ ఉన్నాయి. 350 పుస్తకాలు పట్టే ఈ గ్రంథాలయాలను వారాంతాల్లో మాత్రమే తెరుస్తారు.
మెట్ల గ్రంథాలయం
రష్యా రాజధాని మాస్కో ఉద్యానవనాల్లో ఇలా మెట్ల ఆకారంలో గ్రంథాలయాలు పెట్టేశారు. వెనకవైపు ఉన్న అరల్లోంచి పుస్తకాలు తీసుకుని, ముందువైపు మెట్లపై కూర్చుని చదువుకోవచ్చన్నమాట. భలే బాగుంది కదూ..
ఫోన్‌బూత్ గ్రంథాలయం
మొబైల్ వచ్చాక ఫోన్బూత్లన్నీ ఖాళీ అయిపోయాయి కదా, వాటినేం చేయాలా అని ఆలోచిస్తున్న ఇంగ్లాండ్ వాసులకు ఓ ఆలోచన వచ్చింది. అంతే పుస్తకాలు తెచ్చిపెట్టేశారు. వాటిలో.. చుట్టుపక్కల వాళ్లందరూ రోజూ ఆ బూత్‌ల్లోకి వెళ్లి ఇలా తెలివితేటల్ని పెంచుకుంటున్నారు.
Authorization